నిజంగానే నేను ఇక మీకు కనిపించను. రేపటి నుంచి నా చుట్టూ పరదాలు వచ్చేస్తాయి. నా లోపల ఏం జరుగుతున్నదో కూడా మీకు తెలియదు. ఈ సాయంత్రం 5 గంటల నుంచి నేను మీకు లేను. శతాబ్దాల తరబడి మీకు సేవ చేశాను. ఇంకో వందేళ్ల పాటు సేవ చేద్దామని అనుకున్నాను కానీ నన్ను వదిలించుకోవాలనే ఈ పాలకులు చూస్తున్నారు. కేవలం వాస్తు అనే ఒక మూఢ నమ్మకం కోసం నన్ను బలి ఇచ్చేస్తున్నారు. నిజాం నవాబు ను కూడా సంతోష పెట్టాను కానీ ఈ పాలకుడిని సంతోష పెట్టలేకపోయాను. ఎందుకో అర్ధం కాదు. మీరు అధికారంలో ఉండటానికి పోవడానికి నేను కారణం ఎలా అవుతాను? అధికారంలో ఎవరు ఉన్నా నేను ఆశ్రయం కల్పించి సజావుగా పనులు పూర్తి కావడానికి సహకరిస్తాను తప్ప నేను పక్షపాతంతో వ్యవహరించను. అది తెలుసుకోకుండా నాకు వాస్తు బాగాలేదని చెప్పి నన్ను కూలగొట్టేస్తున్నారు. వాస్తు కావాలంటే మీ ఇళ్లకు చూసుకోండి పబ్లిక్ ప్లేస్ అయిన నాకు వాస్తు ఏమిటని నేను ఎంత మొత్తుకున్నా మీరు వినడం లేదు. వందేళ్లు నిలబడతానని నేను హామీ ఇస్తున్నా నువ్వు అక్కరలేదు ఫో అంటున్నారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడగాలని కూడా అనిపించడం లేదు. ఎందుకంటే మీరెవ్వరూ నన్ను ఇంత కాలం పట్టించుకోలేదు. కేవలం కొందరు రాజకీయ నాయకులు అదీ కూడా కేవలం వారి రాజకీయ అవసరాల కోసం నన్ను పట్టించుకున్నట్లు నటించారు. అంతే దానివల్ల ఒరిగేదేమీ లేదని నాకు కూడా తెలుసు. ప్రజలంతా ఉద్యమించాలి. కానీ ప్రజలు ఎవ్వరూ ఉద్యమించలేదు సరి కదా పాలకులు చెప్పిందే వేదవాక్కుగా భావిస్తున్నారు. అలానే భావించండి. నన్ను కూలగొట్టిన తర్వత అయినా బంగారు తెలంగాణ సాకారం అవుతుందేమో చూసుకోండి. మీ స్వార్ధం మీది. కోట్లాది రూపాయలు ఎందుకురా తగలపెడతారు అని అడిగినా మీ గుండెలు కరగడం లేదు. నిజానికి రాళ్లతో కట్టిన నాకు రాతిగుండె ఉండాలి కానీ అదేమిటో రక్త మాంసాలతో తయారైన మీ గుండెలు రాతి గుండెలుగా మారాయి అందుకే నా గోడు మీకు వినపడటం లేదు. మీరు వినరు కూడా. మీరంతా బంగారు తెలంగాణ మత్తులో జోగుతున్నారు. మీ కంటికి వాస్తవాలు కనిపించవు. ఇంత కాలం నా గుండెలపై తలదాచుకున్న సిబ్బంది పాపం ఎంతో బాధపడుతున్నారు. నన్ను వదలి పోవాలంటే. అయితే వారి ఉన్నతాధికారులు వారికి సహకరించరు ఎందుకంటే ఉన్నతాధికారుల్లో చాలా మంది ఈ గడ్డకు పుట్టిన బిడ్డలు కాదు కదా? వారి సెంటిమెంటు ఎందుకు వుంటుంది? అప్పటికీ కొందరు ఉన్నతాధికారులు అడిగారట… ఇంకొద్ది రోజులు సమయం కావాలని…అయితే పాలకులు ఒప్పుకోలేదట. నన్ను కూలగొట్టి వారు కలకాలం ఉండాలనుకుంటున్నారు. ఉండనివ్వండి. మీ బంగారు తెలంగాణ కోసం నా బంగారం లాంటి భవిష్యత్తును మీకు అర్పిస్తున్నాను. మీతో ఎంత చెప్పినా లాభం లేదు. మీకు నా గోస అర్ధం కాదు. ఇక శెలవు. మీరంతా కలిసి బంగారుతెలంగాణ సాధించుకోండి. బై బై
ఇట్లు
నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిజాయితీగా ఇంత కాలం సేవలు అందించిన
మీ