సెలవులు, ఫిఫ్టింగ్ మధ్య తెలంగాణలో పరిపాలనకు బ్రేక్ వచ్చేసింది. ఉన్న సెక్రటేరియేట్ ను కూలగొట్టుకుంటూ కొత్త దాని కోసం పరుగులు తీస్తున్న పాలకులు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించలేక ‘వర్క్ ఫ్రమ్ హోం’ ఇచ్చేస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియేట్ లో పని చేస్తున్న దాదాపు సగం మంది వర్క్ ఫ్రమ్ హోం లో ఉన్నారు. సెక్రటేరియేట్ సిబ్బంది ఆఫీసులకు సక్రమంగా వస్తుంటేనే పనులు జరగడం లేదు. ఇక ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం అంటే ఇక అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి అన్ని శాఖల కార్యదర్శులు నేటి నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరికి సంబంధించిన విభాగాలకు ఎక్కడ స్థలం కేటాయించారో వీరికే తెలియదు. ఆ సిబ్బంది వచ్చారో లేదో తెలుసుకోవడానికే సమయం పడుతుంది. సందట్లో సడేమియాలాగా డ్యూటీలు ఎగ్గొట్టే సిబ్బంది మా సీటు ఎక్కడుందో మాకే తెలియడం లేదంటూ డుమ్మా కొడుతున్నారు. అధికారికంగా సీట్లు కేటాయించని సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోంను ఉన్నతాధికారులే ఇస్తుండగా అనధికారికంగా వర్క్ ఫ్రమ్ హోం తీసుకుంటున్న వారి సంఖ్య కూడా లెక్కకు మించే ఉంది. ఏ శాఖ కూ ఇప్పటి వరకూ ఫైళ్లు చేరలేదు. తమ తమ శాఖలకు చెందిన ఫైళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తర్వాత మిస్సింగ్ ఫైళ్ల అంశం పైకి వస్తుంది. అప్పటి వరకూ పరిపాలనకు సెలవు తప్పదు. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో ఎక్కడి షిఫ్టింగ్ పని అక్కడే నిలిచిపోయింది. బిఆర్ కె భవన్ కు రంగులు వేయడం, లిఫ్టులు బాగు చేయడం ఇంకా పూర్తి కాలేదు. మంత్రుల గదులు ఇంకా సిద్ధం కాలేదు. మంత్రుల గదులు సిద్ధం కావడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. సెక్షన్ ఆఫీసులైతే ఇంకో మూడు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదు. ఎక్కడా ఏసీలు, ఫ్యాన్లు కూడా లేవు. అందువల్ల అవన్నీ సమకూరేదాకా సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోం తప్పదు. ఎంచక్కా పని చేయకుండా జీతం తీసేసుకోవచ్చు. సచివాలయం షిఫ్టింగ్ తో సిబ్బందికి ఇలాంటి చాలా లాభాలు ఉన్నాయి. షిఫ్టింగ్ కాంట్రాక్టర్ కు మాత్రం చేతినిండా పని జేబు నిండా డబ్బులు. పరిపాలన మాత్రం గాలికి పోతున్నది.
previous post
next post