దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆర్ధిక మాంద్యం తెలంగాణలో ఒక రోజు ముందే వచ్చిన అతిధిలా త్వరగానే పలుకరించింది. రోజువారీ ఖర్చుల కోసం తప్ప సాయం చేయలేని స్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో అప్పుల భారం తెలంగాణపై పెను ప్రమాదం చూపబోతున్నది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఆర్ధిక మాంద్యం ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నది. రోజూవారీ పరిపాలనా ఖర్చులు తప్ప మరే ఇతర ఖర్చులు ఉండరాదని ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం నుంచి వచ్చిన తాఖీదుల ప్రకారం ఇక నుంచి ఏ కొత్త ప్రాజెక్టును ఇప్పటిలో తీసుకునే పరిస్థితి ఉండదు. తెలంగాణలో ఇప్పటికే అమలు చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లు లు చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మల్లగుల్లాలు పడుతున్నది. రోజువారీ ఖర్చులతో బాటు పెండింగ్ బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వానికైనా అనివార్యం. అయితే ఆ పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రతి చిన్న విషయానికి ఖజానా పరిస్థితి చూసుకోవాల్సి వస్తున్నది. అందువల్ల ముఖ్యమైన బిల్లులు కూడా చెల్లించేందుకు తెలంగాణ ఆర్ధిక శాఖ కింద మీదా పడుతున్నది. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణలోనే కాదు. అయితే ఈ ప్రభావం ఎంత కాలం ఉంటుందో తెలియక పోవడంతో ఆర్ధిక శాఖ అధికారులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఇక నుంచి కేంద్రం ఇచ్చేపన్నుల వాటాలో రాష్ట్రాలు చెల్లించాల్సిన రుణాలపై వడ్డీని మినహాయించుకొని ఇస్తుందని కూడా సమాచారం అందడంతో తెలంగాణ ఆర్ధిక శాఖ మరింత బెంబేలుపడిపోతున్నది. ప్రతి త్రైమాసికానికి విడుదల చేసే గ్రాంట్ల లో కూడా కేంద్రం కోత పెట్టే అవకాశం ఉందని అంచనా వేసుకుంటున్నారు. ఇవన్నీ రాష్ట్రంలో బకాయిల చెల్లింపు, కొత్త పథకాలను చేపట్టడం, కొత్త రిక్రూట్ మెంట్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
previous post
next post