30.7 C
Hyderabad
April 16, 2024 23: 51 PM
Slider సంపాదకీయం

మళ్లీ రగులుతున్న ‘తెలంగాణ తల్లి’ విగ్రహం సెంటిమెంట్

#telanganatalli

‘‘ తెలంగాణ తల్లి’’ విగ్రహ వివాదం ఇప్పుడు ముదురు పాకాన పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహం ‘‘దొరల తల్లి’’ అని చెబుతూ ‘‘పేదవారి తల్లి’’ విగ్రహాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రూపొందించారు. ఇంత కాలం రాజకీయ వ్యవహారాలపైనే పోరాటం చేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక అంశాలపై దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది.

ఉద్యమమే సెంటిమెంట్ పై ఆధారపడి నడిచింది. అందుకే తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది యువకులు ఆత్మార్పణ చేశారు. తెలంగాణ ప్రాంతంలో భావోద్వేగాలు ఎక్కువ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకూ వాటిని రెచ్చగొట్టి రాజకీయం చేశారు.

ఇప్పుడు అదే బాటలో రేవంత్ రెడ్డి వచ్చేస్తున్నారని భావించవచ్చు. ఇప్పటికే తెలంగాణ ‘‘విమోచన’’ ‘‘విలీన’’ పదాల మధ్య నలుగుతూ వచ్చింది. బిజెపి మొదటి నుంచి తెలంగాణ విమోచన దినం గా భావిస్తుంటే తెలంగాణ విలీన దినం గా కమ్యూనిస్టులు చెబుతుంటే వారు. నిజాం నిరంకుశ పాలన నుంచి సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన జరిగిందని బిజెపి నాయకులు చెబుతుంటారు.

విలీనం విమోచనం వివాదాలు

అయితే తెలంగాణను భారత్ లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించిన రోజు అయినందున తెలంగాణ విలీన దినం గానే భావించాలని కమ్యూనిస్టులు వాదించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ పార్టీ అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవం జరిపేది. ‘‘తెలంగాణ విమోచన దినోత్సవం’’ అధికారికంగా జరపాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. విలీనమో, విమోచనో ఏదో ఒకటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారికంగా జరుపుతారని తెలంగాణ ప్రజలు భావించారు.

సమైక్యతా దినం పేరుతో కేసీఆర్ కొత్త ఆలోచన

అలాంటిది జరగలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్  సెప్టెంబరు 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని నిర్ణయించారు. సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలనూ, 2023 సెప్టెంబరు 16, 17, 18 తేదీలలో ముగింపు వేడుకలనూ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సరికొత్తగా తయారు చేయిస్తోంది. కొత్త రూపురేఖలతో తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెప్టెంబరు 17న రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ విడుదల చేసింది.

సామాన్యులకు ప్రతిరూపంగానే ఉండాలి: రేవంత్

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి సామాన్యులకు ప్రతిరూపంగా ఉండేలా తీర్చిదిద్దామని తెలిపారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం బంగారు కిరీటం, వజ్ర వైఢూర్యాలను ధరించి దొరలకు ప్రతిరూపంగా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ తల్లి కష్టజీవి,ఊరి సంస్కృతికి ప్రతిరూపం,మన తల్లి దొరల గడీలలో దొరసాని కాదన్నారు కాంగ్రెస్‌ నేతలు. ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన తల్లి లక్షణం కానే కాదంటున్నారు.

సాయుధ పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంలో ప్రతి పల్లె, ప్రతిపట్నం, ప్రతి తండా, ప్రతి గూడెం…ఊరు వాడ ఏడాది పాటు మన వారసత్వ ఘనతను చాటుదామని పిలుపునిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఈ విగ్రహాన్ని సెప్టంబరు 17న ఆవిష్కరించనున్నారు.

తెలంగాణ తల్లికి రూపమిచ్చింది కేసీఆర్ భావనలే

తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా, దాన్ని ఉద్యమ ప్రతీకగా ముందుకు తేవాలన్న ఆలోచన మాత్రం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసారథి కేసీఆర్‌దే. తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, తత్వవేత్త బీఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.

బి. ఎస్. రాములు ఆలోచనలు, సూచనల ప్రకారం.. కంప్యూటర్‌పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బి. వి. ఆర్. చారి. సాధారణ స్త్రీ మాదిరిగా(తలపై కీరీటం ఆభరణాలు లేకుండా) కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని బీయూఆర్ చారి చిత్రించారు.

ఆ రూపాన్ని బీఎస్ రాములు ఉద్యమ సారథి కేసీఆర్ ముందు అప్పటిలో పెట్టగా.. ఆయన కొన్ని మార్పులు సూచించారు. ఈ విషయమై చర్చించడానికి తెలంగాణ భవన్‌లో రెండు సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సమావేశాల్లో బీఎస్ రాములు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ గంగాధర్, గన్‌పార్క్‌లోని 1969 తెలంగాణ అమరవీరుల స్థూపం సృష్టికర్త ఎక్కా యాదగిరి రావు, తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత, విశ్లేషకులు దుర్గం రవీందర్, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, ఈ తరం చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ మహిళలు, రచయితలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు పాల్లొన్నారు.

ఈ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతానికి గుర్తుగా పేద స్త్రీ రూపంలో ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎప్పటికీ ఇలాగే వెనుకబడి ఉండదు కదా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా, దేశంలోనే సంపన్న రాష్ట్రంగా, బంగారు తెలంగాణగా మారుతుంది. రాజా రవివర్మ గీసిన దేవతల బొమ్మల స్ఫూర్తితో భారత మాత చిత్రాన్ని రూపొందించారు.

ఆ చిత్రాన్ని తలపించేలా తెలంగాణ తల్లికి రూపమివ్వాలి అని కేసీఆర్ సూచించారు. కెసిఆర్ సూచనతోపాటు సమావేశాల్లో పాల్గొన్న మరికొందరు ఇచ్చిన సూచనలకు తగినట్లుగా ప్రొఫెసర్ గంగాధర్ ఇప్పటి తెలంగాణ తల్లికి రూపాన్నిచ్చారు. తెలంగాణ లోని నాటి పది జిల్లాలకు చెందిన ప్రత్యేకతలను తెలంగాణతల్లి రూపకల్పనలో జోడిస్తూ తీర్మానించారు.

ఇప్పుడున్న విగ్రహానికి విలువైన ఆభరణాలు

తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి చీర, కరీంనగర్ వెండి మట్టెలు,కోహినూర్ వజ్రం, జాకబ్ వజ్రం,పాలమూరు,మెదక్, అదిలాబాద్ మెట్ట  పంటలకు చిహ్నంగా మక్క కంకులు,నిజామాబాద్ వరంగల్, కరీంనగర్,జిల్లాల సంస్కృతికి చిహ్నంగా బంగారు నగలు, భరతమాతముద్దు బిడ్డగా , రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీటంలో ప్రసిద్ద కొహినూర్ వజ్రం,వడ్డాణం,జరీ అంచుచీర నిండైన కేశ సంపద తదితరాలతో తుదినెరుగులు తీర్చిదిద్దడం జరిగింది. పసునూరి దయాకర్ చేతుల మీదుగా తయారైన తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007, నవంబర్ 15న టీఆర్‌ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో పలువురు ప్రముఖులు, నాయకుల ఆధ్వర్యంలో కేసీఆర్ ఆవిష్కరించారు.

ఇలాంటి విగ్రహాలనే అన్ని నియోజకవర్గాల్లో ఆవిష్కరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. అలా నేడు ఊరూర తెలంగాణ తల్లి విగ్రహాలు, ఇంటింటాతెలంగాణతల్లి చిత్రపటాలు, మెమెంటోల తో తెలంగాణ తల్లి స్ఫూర్తి నిస్తున్నది. ఇప్పుడు ఈ తల్లి విగ్రహాన్ని మారుస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. బీజేపీ కమ్యూనిస్టుల మధ్య ఉన్న విలీన విమోచన భావ వైరుద్ధంతో ఇంత కాలం నలిగిన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ రూపొందించిన తల్లి విగ్రహం, రేవంత్ రూపొందించిన తల్లి విగ్రహం భావాల మధ్య నలిగిపోవాల్సిందేనా???

Related posts

క‌లెక్ట‌ర్,ఎస్పీలతో ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు కాంతిలాల్ దండే  ప్ర‌త్యేక స‌మావేశం

Satyam NEWS

సేవ్ పబ్లిక్ సెక్టార్ – సేవ్ సోషల్ జస్టిస్

Satyam NEWS

చంద్రబాబు వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కౌంటర్ ఎటాక్

Satyam NEWS

Leave a Comment