35.2 C
Hyderabad
April 20, 2024 17: 12 PM
Slider సినిమా

ఫ్లాప్ షో: వ్రతం చెడ్డా ఫలితం దక్కని తెలుగు హీరోలు

#Telugu Film Industry

తెలుగు సినిమా హీరోలు ఆ మధ్య తెగ హడావుడి చేసేశారు. కరోనా కారణంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన సినిమా షూటింగ్ లకు వెంటనే అనుమతి ఇవ్వాలని, తద్వారా సినీ పరిశ్రమపై ఆధారపడ్డ వేలాది మంది సినీ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని స్టేట్ మెంట్లు ఇచ్చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించేశారు. వీరు వెళ్లడానికి ముందే ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ లకు అనుమతి ఉన్నా చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు లాంటి హేమా హేమీలు వెళ్లి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.

ఎంతో సహృదయత కలిగిన ముఖ్యమంత్రిగా ఆయనను కొనియాడారు. చిత్ర పరిశ్రమకు సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముందుగానే కలిశారు. అంతకు ముందుకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో రెండు మూడు దఫాలుగా చర్చలు జరిపారు.

ఒక మాక్ షూటింగ్ ను అన్నపూర్ణా స్టూడియోస్ లో జరిపి దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు చూపించారు. ఈ విధంగా తాము షూటింగులు చేసుకుంటాం అనుమతి ఇవ్వండి అని. దాంతో ఆయన మరి కొన్ని సూచనలు చేస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చారు.

ఇంత తతంగం జరిగిన తర్వాత కూడా తెలుగు సినీ పరిశ్రమలో షూటింగ్ లు జరగడం లేదు. సినిమా షూటింగ్ లో పెద్ద ఎత్తున టెక్నీషియన్లు పాల్గొనాల్సి ఉంటుంది. వారంతా భౌతిక దూరం పాటించడం కూడా సాధ్యం కాదు. మధ్యలో అద్దాలు పెట్టి షూటింగ్ చేసే స్థాయికి మన తెలుగు సినిమా ఇంకా ఎదగలేదు.

అలా చేయడం వల్ల సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. సినీ నటులు కూడా కరోనాకు తెగించి నటించేందుకు ముందుకు రావడం లేదు. హీరోయిన్లను ముంబయి నుంచి తెచ్చుకోవాలి. ముంబయి మొత్తం కరోనాతో అట్టుడికిపోతున్నది. స్థానికంగా ఉన్న నటీనటులకు కూడా ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో చెప్పడం కష్టం. జరగరానిది జరిగితే సినిమా మొత్తం ఆపేయాల్సి వస్తుంది.

ఇంత రిస్కు తీసుకుని సినిమాలు షూటింగ్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు ఆగిపోయాయి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయని ఇంత పెద్ద హీరోలు, ఎన్నో చిత్రాలు నిర్మించిన నిర్మాతలు, ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకధీరులకు ముందుగానే తెలియదా?

ఉత్సాహంగా దూసుకువెళ్లి ముఖ్యమంత్రులను ఎందుకు కలిసినట్లు? అనుమతి వచ్చేసింది కదా షూటింగ్ లు ఎందుకు మొదలు పెట్టలేదు? పోనీ అందరూ కాకుండా ముఖ్యమంత్రులను కలిసిన ఆ నలుగురూ అయినా సినిమా షూటింగులు మొదలు పెట్టారా?  సినిమాలు, షూటింగ్ లు కాకుండా వేరే ఎజెండాతోనే ఈ సినీ ప్రముఖులు ముఖ్యమంత్రులను కలిశారా అని టాలివుడ్ వర్గాలు తమలో తామే చర్చించుకుంటున్నాయి.

Related posts

సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్: తప్పు చేసిన యువకుల లొంగుబాటు

Satyam NEWS

కొత్త బ్రాండు వద్దు షారూ… పాత బ్రాండ్లు కావాలి….

Satyam NEWS

తాగి బైక్ నడిపిన ఘటనలో ఇద్దరు మృతి

Satyam NEWS

Leave a Comment