రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కట్టుకథల కనికట్టు చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది. తెలుగుదేశం అధికారికంగా ఇచ్చిన పూర్తి పాఠం ఇది.
అబద్దానికి ప్యాంటు, చొక్కా వేస్తే అది జగన్ రెడ్డి. అబద్ధాల పునాదులపైనే తన పార్టీ ని నిర్మించుకున్న జగన్ రెడ్డి ఎల్లకాలం తను చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉన్నట్లున్నాడు. జగన్ రెడ్డి అబద్ధాలు, మోసాలు తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లిచ్చి వైసీపీ పార్టీని తరిమికొట్టినా జగన్ రెడ్డి తీరు మార్చుకోకుండా మరో మారు అబద్దాలతో మైకుల ముందుకొచ్చాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని 8 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర సంపద దోచుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు తన అరాచకాలు బయటపడడంతో వాటిని కప్పి పుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్త్వానికి తన తప్పులను అంటగడుతూ విషం చిమ్ముతున్నాడు.
వాస్తవాలివీ :
చంద్రబాబు వచ్చిన ఏడు నెలల్లోనే తెచ్చిన, తేబోతున్న అప్పులు రూ.1.54 లక్షల కోట్లు అని జగన్ చెప్తున్నాడు.
బడ్జెట్ అప్పులే 80,827 కోట్లు, అమరావతి పేరుతో 52,000 కోట్లు, మార్క్ ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రూ. 8000 కోట్లు అని నోటికొచ్చిన లెక్కలు చెబుతూ పచ్చి అబద్ధాలను వల్లె వేస్తున్నాడు జగన్ రెడ్డి.
ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందో అని రాగాలు తీస్తున్నాడు. ఈ అప్పుల్లో రూ.20,000 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులే.
మరి వివిధ శాఖల్లో జగన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఎవరు తీరుస్తారు. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా రూ.1.40 లక్షల కోట్ల బకాయిలను జగన్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల్నీ జగన్ ప్రభుత్వం ముందుగానే వాడేసింది.
జగన్ రెడ్డి దోపిడీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. జగన్ రెడ్డి పాపం కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది.
ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏడు నెలల్లో జగన్ రెడ్డి పెట్టిన బకాయిలు చెల్లించింది.
రైతులకు ధాన్యం బకాయిలు 1674 కోట్లు, ఆరోగ్య శ్రీ కి 1800 కోట్లు, ఉద్యోగులకు జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు,సీపీఎస్‌కు సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు,టీడీఎస్ కింద పెండింగ్ బిల్లులు రూ.265 కోట్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.788 కోట్లు, ఇలా వివిధ రంగాలలో 22,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఇప్పటివరకు రూ.21 వేల కోట్లు ఖర్చు చేశారు. అదీ కాక జగన్ రెడ్డి చేసిన అప్పులకు, అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.71వేల కోట్ల చెల్లింపులు చేయాల్సిన భారం కూటమి ప్రభుత్వం పై పడింది..
అంటే ఈ ఎనిమిది నెలలకి జగన్ చేసిన అప్పుకి రూ. 45,000 కోట్లు రూపాయల భారం కూటమి ప్రభుత్వంపై పడింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 5 నెలల్లోనే రూ. 12,367 కోట్ల జగన్ ప్రభుత్వ అప్పులను క్లియర్ చేసింది. ఇది కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుందనడానికి నిదర్శనం.
గత జగన్ ప్రభుత్వం మొదటి 7 నెలల్లో పింఛన్‌లు రూ.250 పెంచడం తప్ప మరే ఇతర నవరత్న హామీలను అమలు చేయలేదు.
చంద్రబాబు ప్రభుత్వం పింఛను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు 1వ తేదినే ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతోంది. ఏడాదికి రూ.33 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.1.60 లక్షల కోట్లు పింఛన్‌లకు ఖర్చు చేయనుంది. ఇది దేశంలోనే రికార్డ్.
204 అన్న క్యాంటిన్లను ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతోంది. దీపం-2 కింద 90 లక్షలకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తుంది. రాబోయే ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు పధకం, మే నెల నాటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పధకాలను ప్రారంభిస్తుంది.
పౌర సరఫరాల శాఖ, మార్క్ ఫెడ్ నుంచి రూ.8 వేల కోట్ల రుణం అని చెప్తున్నాడు. ఇందులో జగన్ పెట్టి వెళ్ళిన ధాన్యం బకాయిలు రూ.1674 కోట్లు కూటమి ప్రభుత్వం తీర్చింది. ఇక ఈ సీజన్లో రాష్ట్రంలో 5,08, 261 మంది రైతుల నుంచి 31,93,769 మెట్రిక్ టన్నుల ధాన్యాన్నికొనుగోలు చేసి రూ.7,354.37 కోట్లు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే కూటమి ప్రభుత్వం జమ చేసింది.
జగన్ రెడ్డి హయాంలో మార్క్ ఫెడ్ రుణాలను దారి మళ్లించి తాడేపల్లి పాలస్ ఖజానా నింపుకున్న జగన్ రెడ్డి ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుల ధాన్యం సొమ్ముల్ని 3 నెలలకు కూడా జమ చేయకపోగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డురం కాక మరేంటి.
అమరావతి పేరుతో 52 వేల కోట్ల అప్పు అని చెప్తున్నాడు. ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న అప్పు రూ.15 వేల కోట్లతో రాష్ట్రానికి సంబంధం లేదు. అది కేంద్రం తీరుస్తుంది. అసలు ఈ అప్పు, రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా జగన్ రెడ్డి లాంటి సైకో తప్ప ఎవరూ చెప్పరు.
అమరావతికి హడ్కో ఇచ్చే రుణం రూ.11 వేల కోట్లు కూడా పూర్తిగా సీఆర్డీఎ లావాదేవీలు. అమరావతి భూములు మీద వచ్చే 2 లక్షల కోట్ల ఆదాయంతో సీఆర్డీఎ తీరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదు. 21 వేల కోట్లు సీఆర్డీఎ ప్రతిపాదించిన అప్పుని కూడా తీసేసుకున్నట్లు చెప్తున్నాడు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే.
కాగ్ లెక్కల ప్రకారం 6 నెలలు అంటే జూన్ నుంచి నవంబర్ వరకు అయిన ప్రభుత్వ ఖర్చు : Rs.1, 09,328.46 కోట్లు (లక్షా 9 వేల కోట్లు). ( Expenditure on Revenue Account, Interest payment, Salaries, Employees Pensions, Subsidy Amounts. Source CAG ). ఈ ఏడు నెలల్లో, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులు ఇవి.
జగన్ రెడ్డిలాగా రుషికొండ ప్యాలెస్ లు కట్టుకోలేదు, ఇంటి చుట్టూ కోట్లు పెట్టి ఇనుప కంచెలు కట్టు కోలేదు. కోట్లు ఖర్చుతో ఎగ్ పఫ్ లు మెక్కలేదు.
జగన్ రెడ్డి సాగించిన ఆర్ధిక విధ్వంసం
జగన్ ఐదేళ్ల పాలనలో అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. జూన్ 2024 నాటికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అప్పులే 6,46,531 కోట్లు కాగా 2 లక్షల కోట్లకు పైనే బడ్జెటేతర అప్పులున్నాయి.
ఇవి కాక పెండింగ్ బిల్లులు మరో 1.42 లక్షల కోట్లు. జగన్ నిర్వాకంతో మొత్తం 12 లక్షల కోట్లకు పైగా అప్పులు, ఏడాదికి చల్లించాల్సిన అసలు, వడ్డీ కలిపి 71,881 కోట్లు.
ఇవి కేవలం ఇప్పటివరకు బయటపడిన అప్పులే. బయటపడాల్సింది ఇంకెంతుందో. తవ్వే కొద్దీ బయట పడుతూనే ఉన్నాయి జగనా సురుడి అరాచకాలు.
2024 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు, బకాయిలు కోట్లలో :
ప్రభుత్వ అప్పు 4,38,278
పబ్లిక్ డెబిట్ 80,914
కార్పొరేషన్ల అప్పు 2,48,677
పౌర సరఫరాలకు బకాయిలు 36,000
విద్యుత్ శాఖకు బకాయిలు 34,267
సరఫరాదారులకు బకాయిలు 1,13,244
ఉద్యోగులకు బకాయిలు 21,980
సింకింగ్ ఫండ్ లోటు 1,196
మొత్తం 9,74,556 కోట్లు
ఒక్క విద్యుత్ రంగం లోనే అప్పులు 1.35 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లించడమే కాకుండా విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, పన్నులు, ఇసుకపై చివరకి చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలపై భారం మోపారు. ·
GSDP గ్రోత్ రేట్ పడిపోవడంతో రాష్ట్రం రూ. 6.94 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 16% నుంచి 11.9% కి పడిపోయింది. సేవారంగంలో 11.9% నుంచి 9.9% కి పడిపోయాము.
2019 నాటికి టీడీపీ హయాంలో ఉన్న 13.5 శాతం గ్రోత్ రేట్ అలాగే కొనసాగి ఉంటే రాష్ట్రానికి రూ.76,195 కోట్ల అదనపు ఆదాయం వచ్చేది. రూ. 40,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఆ సొమ్ముని సైతం దోచేశాడు జగన్ రెడ్డి.
ఐదేళ్లలో విపత్తు నిధులు, పోలవరం, గ్రామపంచాయతీలు సహా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించాడు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి తాడేపల్లి ఖజానా నింపుకున్నాడు. రూ. 3142 కోట్ల స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించారు.
ఉద్యోగుల పొదుపు సొమ్ము నిధులు 5,243 కోట్లు, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్ లకు చెందిన పెన్షన్, పీఎఫ్ నిధులు 3,143 కోట్లను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ బాండ్లలో పెట్టి ఇతర అవసరాలకు మళ్లించారు.
డ్వాక్రా మహిళలు అభయ హస్తం కింద రోజుకు రూపాయి పొదుపు చేసే నిధులను 2,100 కోట్ల సొమ్మును సైతం కొట్టేశారు.
జగన్ రెడ్డి నిర్వాకంతో 2024-25 సంవత్సరానికి 1,46,909 కోట్లు లోటులో ఉన్నట్లు తేలింది.
రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా కేవలం రుణాలు సమీకరించి వాటిని దారి మళ్లించేందుకు ఏ.పి.ఎస్.డి.సి ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా తీసుకున్న అప్పుల గురించి బడ్జట్ పుస్తకాల్లో చూపకుండా బ్యాంకుల నుండి రూ.25 వేల కోట్ల రుణాల సమీకరణకు ఒప్పందాలు చేసుకున్నారు.దీనికి మధ్యం ద్వారా వచ్చే అధనపు సుంకాన్ని ఎస్క్రూ చేస్తూ మధ్యం డిపోల నుండి వచ్చే ఆదాయాలను ఏ.పి.ఎస్.డి.సి ఖాతాలకు మళ్లించి వాటిని బ్యాంకు రుణాల చెల్లింపులకు వర్తించే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు.
రాబోయే 15 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాలను సైతం జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టడం చూసి దేశం మొత్తం నివ్వెరబోయింది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న బారోయింగ్ కండిషన్లకు పూర్తి విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల లూటీ, దుబారా కారణంగానే రాష్ట్ర ఆదాయాలు అడుగంటాయి, ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. గతంలో ఆర్ధిక సూచీలో 3,4 వ స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని జగన్ రెడ్డి 17 వ స్థానానికి దిగజార్చాడని నీతి ఆయోగ్ నివేదిక చాచి కొట్టినట్లు చెప్పింది.
జగన్ రెడ్డి నిర్వాకంతో రాష్ట్రంలోని అన్ని రంగాలు దారుణ విధ్వంసానికి గురయ్యి వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ లా ఏపీ పరిస్థితి తయారయింది. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని నిలబెట్టేలా, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేని జగన్ అబద్దాలు, కట్టు కథలు, కల్లబొల్లి కబుర్లతో ప్రజా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ప్రజలే జగన్ రెడ్డి పార్టీని గంగలో కలుపుతారు.