28.7 C
Hyderabad
April 20, 2024 09: 39 AM
Slider ముఖ్యంశాలు

కళాతపస్వి కె. విశ్వనాథ్ మహాభినిష్క్రమణం

#kviswanath

తెలుగు చలన చిత్ర రంగం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. కళాతపస్వి కె విశ్వనాథ్ కొద్ది సేపటి కిందట తుది శ్వాస తీసుకున్నారు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్శకుడిగా పనిచేశారు.

అక్కినేని నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. ఆయన సినీ జీవితంలో పేరెన్నికగన్న చిత్రం శంకరాభరణం. ఇది జాతీయ పురస్కారం గెలుచుకుంది. భారతీయ కళల నేపథ్యంలో ఆయన తీసిన చిత్రాలు శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రధామైనవి.

సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన తీసిన చిత్రాల్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం ముఖ్యమైనవి. దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. సినిమారంగంలో చేసిన కృషికిగాను, 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు.

1992 లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. అదే సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. కళాతపస్వి ఆయన బిరుదు.విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామం. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడి నుంచి వారి నివాసం విజయవాడకి మారింది. ఉన్నత పాఠశాల విద్య అంతా విజయవాడలోనూ, కాలేజీ విద్య గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ జరిగింది. బి.ఎస్సీ డిగ్రీ చేశారు.

చెన్నై లోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టారు. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్ళు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆయనతో కలిసి అన్నపూర్ణ వారి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాత సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని వాగ్దానం చేశారు.

అలా డాక్టర్ చక్రవర్తి తర్వాత అక్కినేని నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాదులో నిర్మాతగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈ సినిమాకు కథను సమకూర్చగా, భమిడిపాటి రాధాకృష్ణ, గొల్లపూడి కలిసి మాటలు రాశారు. దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాలను కూడా తీసుకుని విశ్వనాథ్ చిత్రాలు నిర్మించారు. సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.

Related posts

ఆదాయం పెంపు లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు బాధాకరం

Satyam NEWS

కేసీఆర్ దూర దృష్టితోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి

Satyam NEWS

లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ త్రిల్లర్స్ మెచ్చేవారికి ‘నేనెవరు’

Satyam NEWS

Leave a Comment