25.2 C
Hyderabad
January 21, 2025 12: 07 PM
Slider క్రీడలు

తెలుగు టైటాన్స్‌కు పదో విజయం: బెంగాల్ వారియర్స్‌పై గెలుపు

#telugutitons

ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్  కీలక విజయం సాధించింది. కెప్టెన్‌ విజయ్ మాలిక్ సూపర్ టెన్‌తో సత్తా చాటడంతో వరుసగా రెండు పరాజయాల తర్వాత తిరిగి గెలుపు బాటలోకి వచ్చింది.  పుణెలోని బలేవాడి స్పోర్ట్స్‌ సెంటర్ కాంప్లెక్స్‌ లో శనివారం ఉత్కంఠగా జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 34–32తో బెంగాల్‌ వారియర్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. టైటాన్స్ తరఫున కెప్టెన్‌ విజయ్ మాలిక్‌ 11, ఆశీష్ నర్వాల్‌  9 పాయింట్లతో సత్తా చాటారు. బెంగాల్‌ వారియర్స్ జట్టులో స్టార్ రైడర్‌‌ మణీందర్ సింగ్‌ 14 పాయింట్లతో రాణించాడు.

డిఫెండర్‌‌ మంజీత్‌ 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. 17 మ్యాచ్‌ల్లో పదో విజయంతో టైటాన్స్‌ ఏడు నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. వరుసగా రెండు ఓటముల తర్వాత  తెలుగు టైటాన్స్‌ ఈ మ్యాచ్‌ను వరుస పాయింట్లతో ఆరంభించింది. తొలి కూతకు వచ్చిన బెంగాల్‌ రైడర్‌‌ మనీందర్‌‌ను ఆశీష్ నర్వాల్ డ్యాష్‌ ఔట్‌ చేయడంతో తెలుగు జట్టు ఖాతా తెరిచింది. కానీ, టైటాన్స్‌ స్టార్ రైడర్‌ విజయ్ మాలిక్‌ను ట్యాకిల్‌ చేసిన బెంగాల్‌కు తొలి పాయింట్‌ అందించాడు. అయితే, ప్రణయ్‌ రాణెను శంకర్‌‌ నిలువరించగా.. తర్వాతి రైడ్‌లో విజయ్ మాలిక్ విజయవంతం అవ్వడంతో టైటాన్స్‌ 3–1తో ఆరంభం ఆధిక్యం సాధించింది.

కానీ, వరుస ట్యాకిల్స్‌తో పాటు మణీందర్ సక్సెస్‌ఫుల్ రైడ్స్‌తో వారియర్స్ 5–5తో స్కోరు సమం చేసింది. మణీందర్‌‌ డూ ఆర్ డై రైడ్‌కు వచ్చినప్పుడు టైటాన్స్‌ ఆటగాడు శంకర్ బ్యాలెన్స్‌ కోల్పోయి లాబీలోకి వెళ్లిపోయాడు. దాంతో బెంగాల్ 7–6తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. ఇక్కడి నుంచి ఇరు జట్లూ పోటాపోటీగా తలపడ్డాయి. చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లాయి. ఆశీష్ నర్వాల్ ఒకే రైడ్ లో రెండు పాయింట్లు రాబట్టడంతో టైటాన్స్‌ 14–12తో ముందంజ వేసింది. విజయ్ మాలిక్‌ వరుసగా రెండు పాయింట్లు తేవడంతో ఆధిక్యం 16–12కి పెరిగింది.

బెంగాల్ కోర్టులో ఇద్దరే మిగలడంతో ఆ జట్టు ఆలౌట్ ప్రమాదం ముగింట నిలిచింది.  కానీ, విజయ్ మాలిక్‌ను సూపర్‌‌ ట్యాకిల్ చేయడంతో వారియర్స్ ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించుకోగా టైటాన్స్ 16–15తో ఒక పాయింట్ ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో అర్ధభాగంలో ఆరంభం నుంచే ఆట హోరాహోరీగా సాగింది. విరామం నుంచి వచ్చిన వెంటనే బెంగాల్ మరో సూపర్ ట్యాకిల్ చేసింది. ఈసారి ఆశీష్ నర్వాల్‌ను నిలువరించి 18–17తో తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది.

టైటాన్స్‌ వేగం పెంచింది. ప్రఫుల్‌, విజయ్ మాలిక్ వరుసగా రైడ్ పాయింట్లు రాబట్టగా.. మణీందర్‌‌తో పాటు మయూర్ కదమ్‌ను ట్యాకిల్ చేసిన తెలుగు జట్టు 28వ నిమిషంలో బెంగాల్‌ను ఆలౌట్ చేసింది. దాంతో 23–20తో ముందంజ వేసింది. బెంగాల్‌ పుంజుకునే ప్రయత్నం చేసింది. మణీందర్ సింగ్ ఆ జట్టుకు డబుల్ రైడ్ పాయింట్‌  అందించాడు.

ఆశీష్ నర్వాల్ నాలుగు పాయింట్ల సూపర్ రైడ్ చేయడంతో టైటాన్స్ ఆధిక్యం 29–23కి పెరిగింది. అయితే, బలమైన డిఫెన్స్‌తో ఆశీష్‌ ను రెండుసార్లు ట్యాకిల్ చేసిన బెంగాల్‌ రైడింగ్‌లోనూ వేగం పెంచింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 28–31తో టైటాన్స్‌కు చేరువైంది. కానీ, చివరి క్షణాల్లో రెండు విజయవంతమైన రైడ్ పాయింట్లు రాబట్టిన కెప్టెన్‌ విజయ్ మాలిక్ టైటాన్స్‌ను గెలిపించాడు.

Related posts

అంగన్ వాడి ద్వారా గర్భిణీలకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ…

Satyam NEWS

పేదల పట్టాలపై వాలుతున్న భూ రాబందులు

Satyam NEWS

ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవిస్తున్నామంటే ఆనాటి సమరయోధుల త్యాగ  ఫలితమే

Satyam NEWS

Leave a Comment