డ్రగ్స్…. ఇప్పటి వరకూ సినిమాల్లోనే చూసిన మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ‘డ్రగ్స్’. తెలంగాణలో ‘వైట్ ఛాలెంజ్’ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై పోరాటం మొదలు పెట్టారు. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు రావడం, అయితే అలాంటిదేం లేదని స్థానిక పోలీసులు తేల్చేయడంతో రేవంత్ రెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు ఫిర్యాదు చేశారు. దాంతో గత కొద్ది రోజులుగా వారు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ దశలో రేవంత్ రెడ్డి డ్రగ్స్ వాడకంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరారు. విశ్వేశ్వరరెడ్డి ఈ ఛాలెంజ్ ని స్వీకరించి డ్రగ్స్ వాడకాన్ని నిరూపించే పరీక్షలకు సిద్ధం కాగా రాహుల్ గాంధీకి ఇలాంటి పరీక్షలు చేయిస్తే తాను కూడా సిద్ధమని కేటీఆర్ చెప్పారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సమయంలో ఆంధాలో 20 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుపడ్డాయి.
దాంతో డ్రగ్స్ పై తెలంగాణలో, ఆంధ్రాలో కూడా కలకలం రేగుతున్నది. గుజరాత్‌లోని కచ్ జిల్లా ముంద్రా పోర్ట్ నుంచి 2,988.21 కేజీల హెరాయిన్ ఉన్న రెండు కంటెయినర్లను కొద్ది రోజుల క్రితం డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు సీజ్ చేశారు. టాల్క్ స్టోన్ పేరుతో వీటిని విజయవాడకు చెందిన ఓ సంస్థ దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. హెరాయిన్‌ను అఫ్గానిస్థాన్ నుంచి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్ట్ మీదుగా గుజరాత్‌కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అహ్మదాబాద్, దిల్లీ, చెన్నై, గాంధీధామ్, మండవీలో తనిఖీలు చేపట్టగా చెన్నైలో ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. నిందితులు ఆషీ ట్రేడింగ్ కంపెనీ నిర్వహకులైన ఎం సుధాకర్, దుర్గా వైశాలి దంపతులుగా అధికారులు గుర్తించారు. సోమవారం వీరిని భుజ్‌లోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా పది రోజులు డీఆర్‌ఐ కస్టడీలో ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది.
అధికారంలో ఉన్న వారి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వస్తాయా?
ఈ మొత్తానికి రిజిస్టర్డ్ కార్యాలయంగా విజయవాడ ఉంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నది. అయితే ఈ సమయంలో ముందుకు వస్తున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ రవాణా చేసుకోవడం, అదీ కూడా విజయవాడలో అడ్రస్ చూపించడం అధికారంలో ఉన్న వారి సహకారం లేకుండా సాధ్యమా? ఈ ప్రశ్న చుట్టూనే ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలు నడుస్తున్నాయి. అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌కు విజయవాడ గేట్‌వేగా మారిందన్న సమాచారం కలకలం సృష్టిస్తోంది.
ఆ హెరాయిన్‌ను గుజరాత్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తరలించనున్నారన్నది పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. కాగా, స్మగ్లింగ్ రాకెట్ అసలు ప్రణాళిక ఏమిటన్న దానిపై పోలీసులు ఇంకా ఓ అంచనాకు రాలేదు. గుజరాత్ నుంచి విజయవాడ తీసుకువచ్చి ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తారా లేక విజయవాడతో సంబంధం లేకుండా నేరుగా గుజరాత్ నుంచి చెన్నై తరలించాలన్నది స్మగ్లర్ల ప్రణాళికా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. సింథటిక్ డ్రగ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా తెప్పించి విక్రయిస్తున్న ముఠాను గుంటూరు పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అంతలోనే హెరాయిన్ స్మగ్లింగ్‌లో విజయవాడ కేంద్ర బిందువుగా ఉందని తెలియడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.
ఈ దందాపై పోలీస్, డీఆర్‌ఐ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో డ్రగ్స్ కేసును మాఫీ చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నించిందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆంధ్రాలో డ్రగ్స్ స్మగ్లింగ్ లో ‘బిగ్ బాస్’ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నది. ఈ ఆరోపణలలో నిజం ఎంతో ఇప్పుడే తెలిసే అవకాశం లేదు.
ఈ ఆరోపణలు నిజమని తేలితే మాత్రం రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టి పోయినట్లే భావించవచ్చు. దానితో బాటు దక్షిణాది రాష్ట్రాలు మొత్తం డ్రగ్స్ పంజా కిందకి వచ్చేసినట్లే భావించాల్సి ఉంటుంది. ఇది జరిగితే యువత భవిష్యత్తు మొత్తం మత్తులో మునిగిపోయే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.