రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తరువాత భారీగా సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. ఈరోజో..రేపో.. బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొంత మంది శాఖాధిపతులతో పాటు, హెచ్‌ఓడిలను కూడా బదిలీ చేస్తారంటున్నారు.
కొంత మంది ఐఏఎస్ అధికారులు రెండు కంటే ఎక్కువ పోస్టులకు ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. ఇటువంటి వారిస్థానంలో నూతనంగా కొందరికి అవకాశం ఇస్తారంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న దావోస్ వెళుతూ బదిలీలపై కసరత్తు చేశారని, దాని ప్రకారం ఈ రోజు ఉత్తర్వులు వెలువడుతాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక అధికారిని బదిలీ చేస్తారనే ప్రచారం ఉంది. అదే సమయంలో ఆర్థికశాఖలోని అధికారిని కూడా సాగనంపుతారంటున్నారు.
వీరు కాకుండా ఇటీవల తీవ్రస్థాయిలో వివాదాస్పదం అయిన ‘తిరుమల తిరుపతి’ దేవస్థానం అధికారులు కూడా బదిలీ లిస్టులో ఉన్నారంటున్నారు. ముఖ్యమంత్రి ‘దావోస్’ పర్యటన తరువాతనే వీరిని బదిలీ చేస్తారంటున్నారు. అయితే..ఈలోపు కూడా కొందరు టీటీడీ అధికారులను బదిలీ చేస్తారనే ప్రచారం ఉంది. అత్యంత నిజాయితీపరుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్ ను బదిలీ చేయబోతున్నారని సమాచారం.
ప్రస్తుతం సిఆర్‌డిఏ కమీషనర్‌గా ఉన్న కాటంనేని భాస్కర్ ను బదిలీ చేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. చివరకు ఆయన ఒత్తిడి పనిచేసి భాస్కర్ బదిలీకి రంగం సిద్ధమైందంటున్నారు. సిఆర్‌డిఏ కమీషనర్‌గా ఆయన రాజధాని రైతుల మనస్సులను చూరగొన్నారు.