37.2 C
Hyderabad
March 29, 2024 20: 34 PM
Slider సంపాదకీయం

ఈ నాయకులు సమ్మెను సక్సెస్ చేయగలరా?

#AndhraPradeshSecretariat

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టబోతున్నారు….. నిజమా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయగలరా? పటిష్టమైన నాయకత్వం లేని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా సమ్మె చేసినా దాన్ని ఎదుర్కొనడం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పెద్ద కష్టమేమీ కాదు.

ఏపిలో వివిధ సంఘాల పేరుతో ఉద్యోగుల సంఘాలు నడుపుతున్న నాయకులలో దాదాపు సగం మంది ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో వ్యక్తిగతంగా అనుబంధం ఉన్న వారు. వారికి సంబంధించి లేక వారి కుటుంబాలకు సంబంధించిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్న విషయం కొత్తది కాదు.

సచివాలయాన్ని విశాఖ పట్నం తరలిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నాటి నుంచి ఇలాంటి నాయకులు సాగించిన కార్యకలాపాలతో ప్రభుత్వ ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. కనీసం రాతపూర్వకమైన ఆదేశాలు కూడా రాకుండానే ఉద్యోగులను బెదిరించి మరీ విశాఖ పట్నం వెళ్లేందుకు ఇదే నాయకులు సిద్ధం చేశారు.

ఏ మాత్రం ఎదురు ప్రశ్న వేసినా కూడా అలాంటి ఉద్యోగులను గుర్తించి వారికి చుక్కలు చూపించారు. దాంతో సచివాలయంలోని ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వం చేసే పనులపై ప్రశ్నించడం పక్కన పెట్టి కనీసం చర్చించేందుకు కూడా భయపడ్డారు.

ఇదే కాదు. ఈ ఉద్యోగ సంఘాల నాయకులు హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ లను కూడా బెదిరించారు. వారు కూడా ఈ నాయకుల దృష్టిలో పడకుండా ఉండేందుకు ఎంతో కష్టపడేవారు. ఈ హెచ్ఓడిలు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినట్లే నడచుకోవాల్సిందిగా తమ కింది వారికి చెప్పేవారు.

అంత పకడ్బందిగా ఉద్యోగ సంఘాలను నడిపిన చరిత్ర గతంలో ఏ ప్రభుత్వానికి లేదు. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసినా….. దాన్ని వమ్ము చేయడం ఈ ప్రభుత్వానికి పెద్ద కష్టమైన పనేం కాదు.

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఇప్పుడు మాట్లాడుతూ రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడే అవకాశమే తమకు రాలేదని చెప్పారు. పీఆర్సీపై సీఎం ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారని అన్నారు. ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఒప్పందం లేదని, తాము ఎక్కడా సంతకాలు పెట్టలేదని చెప్పారు. పీఆర్సీ వల్ల ఉద్యోగుల జీతాలు పెరగాలే కానీ, తగ్గవని అన్నారు. తమను ఇంత మోసం చేస్తారా? అని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు… అంటే ఉద్యోగులలో  పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయిన సందర్భంలో చర్చకు వస్తున్నాయి తప్ప లేకుంటే చర్చకు వచ్చేవి కాదు. ఇంకా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్కేల్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం పేరుతో ఉద్యోగులను సంక్షోభంలోకి నెడతారా? అని అసహనం వ్యక్తం చేశారు.

పీఆర్సీ ఇవ్వాల్సినప్పుడల్లా ప్రభుత్వాలు ఆదాయం లేవనే చెపుతాయని… రాష్ట్ర విభజన వల్ల ఆర్థికలోటు ఉన్నా గత ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారని… ఆయన అబద్ధాలు చెప్పారని అనుకోవాలా? అని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి రెడ్డి చేసిన ట్వీట్ ను చూపించారు. ఇకపై మాటలు, చర్చలు ఉండవని… ఈనెల 21 సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు.

సాధారణంగా ఎన్జీవో సంఘం నాయకులు ఉద్యోగులను సమ్మెకు సన్నద్ధం చేస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఉద్యోగులే ఎన్జీవో సంఘాల నాయకులను సమ్మె వైపు వచ్చేలా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వైపు వెళుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో నాయకులు కూడా ఇప్పుడు సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. అయితే ఈ నాయకులు ఏ క్షణంలోనైనా ఉద్యోగుల సమ్మెను నీరుకార్చి…. ప్రభుత్వ పెద్దలతో కుమ్ముక్కు కావడానికి మాత్రం అవకాశం ఉంది.

Related posts

వార్త దినపత్రిక జర్నలిస్టుపై పాశవికదాడి

Satyam NEWS

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

Satyam NEWS

నరసరావుపేట ప్రశాంతతను భగ్నం చేయద్దు లోకేష్

Satyam NEWS

Leave a Comment