కాన్ఫిడెన్షియల్ అని పై అధికారి ఎవరైనా ఫైల్ పై రాస్తే అర్ధం ఏమిటి? దానికి పబ్లిసిటి ఇవ్వకుండా చెప్పిన పని చెయ్యమని అర్ధం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పనితీరు పరిస్థితి ఎలా ఉందంటే, కాన్ఫిడెన్షియల్ అని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి రాసిన నోట్ ఒకటి యథేచ్ఛగా బయటకు రావడమే కాకుండా వాట్సప్ లలో కూడా విస్తృతంగా సర్క్యులేట్ అయింది. ఈ మాత్రం భాగ్యానికి ఆయన కాన్ఫిడెన్షియల్ అని రాయడం ఎందుకు? ఫైల్ గోప్యతను కాపాడలేకపోవడం ఎందుకు? అదే అర్ధం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి వి రమేష్ ఈనెల 23వ తేదీ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఒక నోట్ పంపారు. ఆ నోట్ పై కాన్ఫిడెన్షియల్ అని స్పష్టంగా రాశారు. రాష్ట్రంలో వైద్యులు తమకు నిర్దేశించిన పోస్టులో కాకుండా ఇతరత్రా పోస్టుల్లో పని చేయడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ పనితీరు ఆశించినంత మెరుగ్గా ఉండటం లేదని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. దీనికి దిద్దుబాటు చర్యలు ఏం తీసుకోవాలో సూచిస్తూ ఉప ముఖ్యమంత్రికి పంపిన నోట్ అది. వివిధ స్థానాలకు కేటాయించిన డాక్టర్లు డెప్యుటేషన్ లపై వెళ్లడం, ఇతర పోస్టుల్లో పని చేయడం లాంటి చర్యలను తక్షణమే నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతర శాఖల్లో లేదా విభాగాలలో పని చేస్తున్న వారందరి డెప్యుటేషన్లు రద్దు చేయాలని నోట్ లో సూచించారు. అవసరమైన విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, అత్యవసర విభాగాలలో అదనంగా కావాల్సిపోస్టుల ప్రతిపాదనలు పంపాలని కూడా నోట్ లో పేర్కొన్నారు. ఈ చర్యలపై అవసరమైతే జీవోలు విడుదల చేయాలని కూడా కోరారు. ఈ అన్ని పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ముఖ్యమంత్రికి నివేదించాలని చెప్పారు. అయితే ఇది ఎక్కడ నుంచి బయటకు వచ్చిందో కానీ బయటకు వచ్చేసింది. ఇంకేముంది ఎక్కడెక్కడి డాక్టర్లు వచ్చి ఉన్నతాధికారులపైనా, మంత్రులపైనా తమ బదిలీలు నిలుపుదల చేయించుకోవడం కోసం, డెప్యుటేషన్లపై కొనసాగించేలా చేసుకోవడం కోసం వత్తిడి తెస్తున్నారు. ఇలా జరగకుడదనే కాన్ఫిడెన్షియల్ అని రాస్తే దాన్ని కాస్తా పబ్లిక్ చేసేశారు. ఎవరు చేశారు అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో పని చేసిన వారు ఇంకా కీలక పోస్టుల్లో పని చేస్తుండటం వల్లే ఇలాంటివి బయటకు వచ్చేస్తున్నాయి. అయ్యా ఇదీ ప్రభుత్వ పనితీరు.
previous post