వనపర్తి జిల్లాలో బీసీ పొలిటికల్ జెఎసి ఫిర్యాదుతో ఇప్పటికే ముగ్గురు జిల్లా అధికారులు (ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి ప్రభు వినయ్ కుమార్, సివిల్ సప్లయ్ కార్పోరేషన్ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి బీరం సుబ్బారెడ్డి) సస్పెండ్ అయ్యారని, బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు. ఎల్లపుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని, అవినీతి అధికారులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
వనపర్తి జిల్లాలో ఇంకా నలుగురు అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారని, వారు మేల్కొని తీరు మార్చుకోకపోతే వారి అవినీతిపై కూడా బీసీ పొలిటికల్ జెఎసి పోరాటం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. బీసీ పొలిటికల్ జెఎసి ఫిర్యాదుకు స్పందించి వెంటనే విచారణ జరిపి అవినీతి అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు వనపర్తి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వనపర్తి జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేయడంపై బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బీసీ కార్పోరేషన్ కమిషనర్ అప్రూవల్ లేకుండా దాదాపు 16 లక్షల రూపాయలు తన డ్రైవర్, అటెండర్ల పేరు మీద చెక్కు రాసి డ్రా చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20 వ తేదీన జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన కలెక్టర్ అతనిని శుక్రవారం సస్పెండ్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు గుర్రం రాఘవేందర్ గౌడ్, మ్యాదరి రాజు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్