36.2 C
Hyderabad
April 24, 2024 22: 00 PM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

మూడు అంశాల చుట్టూనే ఆంధ్రా రాజకీయం

Amaravathi

ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతి పక్ష పార్టీల మధ్య అసలు గొడవ ఏమిటి? వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం వంద రోజులు కూడా పూర్తి కాకముందే ఆంధ్రప్రదేశ్ లో ఈ యుద్ధ వాతావరణం ఏమిటి? అధికార ప్రతిపక్ష పార్టీలు ఇంతలా గొడవ పడటానికి మూడు కారణాలు ఉన్నాయి.1. రాజధాని అమరావతి మార్పు 2. పిపిఏల పున:సమీక్ష 3. పోలవరం రివర్స్ టెండరింగ్. ఈ మూడు అంశాలతోనే తెలుగుదేశం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ మూడు అంశాలపైనే తెలుగుదేశంపార్టీ మనుగడ ఆధారపడి ఉంది. ఈ మూడు అంశాల ఆధారంగానే టిడిపి మనుగడ ముడిపడి ఉండటం వల్ల ఈ మూడు అంశాలను అధికార వైసిపి వదలడం లేదు.

తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టు అయిన ఈ మూడు అంశాలపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో పట్టుదలగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్ధిక మూలాలు అన్నీ ఈ మూడు అంశాలతోనే ముడిపడి ఉన్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిందే తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం. అక్కడ భూములు సేకరించడం నుంచి రాజధాని ఏర్పాటు వరకూ ఆ తర్వాత కూడా తెలుగుదేశం నాయకుల ఆర్ధిక లావాదేవీలు అన్నీ ఈ ప్రాంతం తోనే ముడిపడి ఉన్నాయి. పై స్థాయిలో ఉన్నవారు వందల ఎకరాలు కొనుగోలు చేస్తే కింది స్థాయి తెలుగుదేశం నాయకులు గజాల్లో స్థలాలు కొనుగోలు చేసుకున్నారు.

అందరి భవిష్యత్తూ మరీ ముఖ్యంగా చంద్రబాబు చుట్టూఉన్న ఒక సామాజిక వర్గం ప్రాణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. పెట్టుబడులు ఇక్కడే ఉన్నాయి. అందుకే వై ఎస్ జగన్ కూడా దీనిపైనే దృష్టి సారించి ఉన్నారు. అమరావతి రాజధాని కాదు అని చెప్పగానే తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెలు ఆగిపోతాయి. ఇక పిపిఏల పున: సమీక్ష. ఈ విషయానికి వస్తే ఇది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక విషయమే. విద్యుత్ ప్రాజెక్టులు ఎలా పెట్టాలో ప్రపంచానికి నేర్పింది తెలుగుదేశం నాయకులే.

ఒక్క పైసా సొంత పెట్టుబడి లేకుండా కేవలం అధికారం ఉంటే చాలు పర్మిషన్లు తెచ్చుకోవడం, దానితో బ్యాంకు రుణాలు తెచ్చుకోవడం, దానితో ప్రాజెక్టులు పెట్టుకోవడం, దాన్ని అధికారం ఉపయోగించి ఎక్కువ రేటుకు అమ్ముకోవడం ఇవన్నీ వరుసగా జరిగే పనులు. విద్యుత్ ప్రాజెక్టుల విషయం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు కూడా బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిసి ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి నాయకులను కూడా కొందరిని ఈ ప్రాజెక్టులలో ఇన్వాల్వు చేసింది.

వారంతా కలిసి కట్టుగా ఈ పిపిఏ ల సమీక్షపై ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. పైగా తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిలో చేరిన నలుగురు ఎంపిలలో ఇద్దరి కైతే ఈ విద్యుత్ ప్రాజక్టులే ప్రాణం. దాంతో వారు ఢిల్లీ స్థాయిలో బిజెపి పంచన చేరి మరీ ఆ పార్టీ పై వత్తిడి తెస్తున్నారు. అధికారులతో కూడా పనులు చేయించుకుంటున్నారు. సి ఎం జగన్ చేతులు కట్టేయాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఘడియకో నాయకుడితోనో, అధికారితోనో పిపిఏల సమీక్షకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ప్రతి రోజూ పత్రికలలో పిపిఏల పున: సమీక్షకు వ్యతిరేకంగా వార్తలు రాయించుకుంటున్నారు.

ఇక మూడోది రివర్స్ టెండరింగ్ విధానం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల మరో ఆయువు పట్టు. ట్రాన్స్ ట్రాయ్ ను పక్కకు జరిపి లేదా కాంప్రమైజ్ చేసి నవయుగను రంగంలో దించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు పోలవరం ఒక కల్ప వృక్షం, ఒక కామధేనువు. ఇక ఇంత కన్నా పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు. అందుకే ఈ మూడు అంశాలపై జగన్ కూడా అంత పట్టుదలగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి, తెలుగుదేశం వేరు వేరుగా కనిపిస్తున్నా ఆత్మ ఈ మూడు అంశాలలో ఒక్కటే. అందుకే ఈ ఆత్రం. ఆర్ధిక లావాదేవీలు అపారంగా ఉన్న ఈ మూడు అంశాలు తప్ప ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న రాజకీయం మరేం లేదు.

చంద్రబాబు తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరితో నైనా ఎగ్రిమెంట్లు చేసుకోవచ్చు. రాజధానిని ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఎవరికైనా కాంట్రాక్టులు ఇచ్చేసుకోవచ్చు. కొత్త ప్రభుత్వం మాత్రం ఇవేవీ చేయకూడదు. పాత కాంట్రాక్టులు, పాత ఎగ్రిమెంట్లను యథాతధంగా అమలు చేసేదానికి ఇక కొత్త ప్రభుత్వం ఎందుకు? ప్రజలు ఓట్లేయడం ఎందుకు? ప్రభుత్వం మార్చుకోవడం ఎందుకు?

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

మార్చి నెలలో రూ.1.42 లక్షల కోట్లు

Sub Editor 2

నీ చావు నువ్వు చావు నేను మాత్రం సేఫ్

Satyam NEWS

విశ్లేషణ: ప్రపంచం బతకడానికి పైసలు కావాలి

Satyam NEWS

Leave a Comment