తిరుమల కొండపై చర్చి నిర్మించారని చెబుతూ దానికి సంబంధించిన ఒక ఫొటో ను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల కొండపై చర్చి ఉందంటూ ఒక ఫొటోను గత నెల 23వ తేదీన ఫేస్ బుక్, వాట్సప్ లలో అప్ లోడ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల గిరుల్లో చర్చిల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందంటూ వారు సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేశారు. దీనిపై విచారణ జరిపిన తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం అధికారులు కొంత సమాచారం సేకరించి తిరుమల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. తిరుపతి శివార్లలోని కరకంబాడి సమీపంలో శేషాచలం అడవుల్లో అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్, దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా ఫోటో తీసి, దానిపై దుష్ప్రచారం చేసినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని చేపట్టిన వ్యక్తి అరుణ్ కాటేవల్లి అని విజిలెన్స్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. అతనిపై తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేపట్టారు. అణువణువునా హిందుత్వం గ్రూప్ అడ్మిన్ ను కూడా పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అటవీ విభానికి సంబంధించిన చెక్ పోస్ట్, వాచ్ టవర్ లను చర్చిగా ప్రచారం జరగడంతో ఎంతో మంది ఆందోళన చెందారు. ముగ్గురిని అరెస్టు చేయడంతో కేసు ఒక కొలిక్కి వచ్చింది. వీరి వెనుక ఉన్నది ఏ పార్టీ అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
previous post