27.7 C
Hyderabad
April 25, 2024 07: 16 AM
Slider విజయనగరం

కరోనా ని త‌రిమికొట్టేందుకు మూడంచెల వ్యూహం

#collectorVijayanagaram

విజయనగరం జిల్లా నుంచి కరోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు మూడంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని  క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ చెప్పారు. ఎస్‌పి రాజ‌కుమారితో క‌లిసి కలెక్టర్  జూమ్ ద్వారా మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డి చేసే ల‌క్ష్యంతో,  వ్యాధి నివార‌ణ‌, చికిత్స‌, నియంత్ర‌ణా కార్య‌క్ర‌మాల‌కు వేర్వేరుగా వ్యూహాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నామ‌ని అన్నారు. వ్యాధి సోక‌కుండా నివారించుకోవ‌డ‌మే అత్యుత్త‌మ‌ మార్గ‌మ‌ని, దీనికోసం ప్ర‌జ‌ల్లో విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టామ‌న్నారు.

63 కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం

మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించ‌డం, సోషల్ డిస్టెన్స్ పాటించ‌డం, త‌రచూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం ద్వారా వ్యాధి సోక‌కుండా అడ్డుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లాలో 63 కేంద్రాల్లో వేక్సినేష‌న్ జ‌రుగుతోంద‌ని, జిల్లా అవ‌స‌రాల‌కు త‌గినంత వేక్సిన్ కూడా స్టాకు ఉంద‌ని తెలిపారు. 

అత్య‌ధిక శాతం మంది హోమ్ ఐసోలేష‌న్‌లోనే ఉండి చికిత్స పొందుతూ, సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా మారుతున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం జిల్లాలో 8,659 ఏక్టివ్ కేసులు ఉండ‌గా, వీరిలో 7,270 మంది హోమ్ ఐసోలేష‌న్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నార‌ని చెప్పారు.

వీరంద‌రికీ కోవిడ్ కిట్ల‌ను అంద‌జేస్తున్నామ‌ని, 96శాతం మందికి కిట్ల‌ను పంపిణీ చేయ‌డం ద్వారా, రాష్ట్రంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిచామ‌ని చెప్పారు. ఇళ్ల‌లో విడిగా, ఏకాంతంగా ఉండ‌టానికి అవ‌కాశం లేని వారికోసం, జిల్లాలో ఏడు చోట్ల కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు.

కరోనా రోగులకు మంచి ఆహారం

వీటిల్లో మంచి భోజ‌న వ‌స‌తుల‌తోపాటు, ఆక్సీజ‌న్ స‌దుపాయాన్ని కూడా క‌ల్పించామ‌ని, మొత్తం 3,700 ప‌డ‌క‌ల‌కు గానూ, ప్ర‌స్తుతం 375 మంది చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. కోవిడ్ వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌ను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 27 కోవిడ్ ఆసుపత్రుల‌ను ఏర్పాటు చేశామ‌ని, వీటిల్లో 2001 ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని తెలిపారు.

ఈ ప‌డ‌క‌ల్లో 208 వెంటిలేట‌ర్లు, 496 ప‌డ‌క‌ల‌కు ఆక్సీజ‌న్ స‌దుపాయం ఉంద‌న్నారు. వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స‌ను అందించేందుకు కావాల్సిన‌ మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు, 1014 మంది వైద్యులు, స‌రిపడినంత మంది న‌ర్సులు, సాంకేతిక సిబ్బందిని కూడా నియ‌మించామ‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం జిల్లాలో సుమారు 2017 రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్లు, అవ‌స‌రాల‌కు స‌రిప‌డా పీపీఈ కిట్లు, మందులు, మాస్కులు, శానిటైజ‌ర్లు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. అర్హులైన‌వారంద‌రికీ ఆరోగ్య‌శ్రీ ద్వారా కోవిడ్‌కు ఉచిత‌ వైద్యాన్ని అందిస్తున్నామ‌న్నారు.

ఆరోగ్య‌శ్రీ‌ వర్తింప చేయడంలో విజయనగరం మొదటి స్థానం

ఇప్ప‌టివ‌ర‌కు 77 శాతం మంది ఆరోగ్య‌శ్రీ‌ని వినియోగించుకున్నార‌ని, ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌డంలో కూడా మ‌న జిల్లా రాష్ట్రంలో మొద‌టి స్థానంలో ఉంద‌ని చెప్పారు.మొద‌టి ద‌శ‌తో పోలిస్తే, క‌రోనా రెండోద‌శ తీవ్రంగా ఉంద‌ని.. ఎక్కువ‌మంది యువ‌కులు కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నార‌ని చెప్పారు.

జిల్లాలో ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గినంత ఆక్సీజ‌న్ కూడా అందుబాటులో ఉంద‌న్నారు. జిల్లాలో రోజుకు సుమారుగా 8.7 మెట్రిక్ ట‌న్నుల ఆక్సీజ‌న్‌ను వినియోగిస్తున్నామ‌న్నారు. దీనిని విశాఖ‌, శ్రీ‌కాకుళం జిల్లాల‌నుంచి తెప్పిస్తున్నామ‌ని, నిల్వ చేసేందుకు ఇటీవ‌లే జిల్లా కేంద్రాసుప‌త్రిలో 10 కిలోలీట‌ర్ల ఆక్సీజ‌న్ ట్యాంకును ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.

పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రిలో కూడా 6 కెఎల్ ట్యాంకును ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. ఇటీవ‌లే బొబ్బిలి ఆసుప‌త్రిలో ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల‌ను 6 నుంచి 10కి పెంచామ‌న్నారు. అవ‌స‌ర‌మైన చోట ఆక్సీజ‌న్ కాన్‌సెంటేట‌ర్ల‌ను అందిస్తున్నామ‌న్నారు. త్వ‌ర‌లో జిల్లాలో ఆక్సీజ‌న్ ప‌డ‌క‌ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

కరోనా చికిత్స‌కు నిధులుకు కూడా కొర‌త లేదు

కరోనా చికిత్స‌కు నిధులుకు కూడా కొర‌త లేద‌ని, ప్ర‌భుత్వం జిల్లాకు సుమారు 14.65కోట్లు కేటాయించ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 4.5కోట్లు వ‌ర‌కూ ఖ‌ర్చు చేశామ‌న్నారు. త్వ‌ర‌లో జిల్లా కేంద్రాసుప‌త్రిలో జ‌ర్మ‌న్ హేంగ‌ర్ ప‌ద్ద‌తిలో 100 ప‌డ‌క‌ల‌తో ట్ర‌యాజ్‌ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఒక‌రినుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెంద‌కుండా, క‌ట్టుధిట్ట‌మైన నియంత్ర‌ణా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. వ్యాధి ఎక్కువ‌గా ఉన్న‌చోట కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు.

క‌రోనా క‌ట్ట‌డికి ఆయా గ్రామ స‌ర్పంచ్‌ల ఆధ్వ‌ర్యంలో గ్రామ స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 778 స‌చివాల‌యాలు ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం 25 స‌చివాల‌యాల ప‌రిధిలోని 143  గ్రామాలు, ఒక్క కోవిడ్ కేసు కూడా లేకుండా గ్రీన్‌జోన్‌లో ఉన్నాయ‌న్నారు. 

వీటిని అలాగే ఉంచేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు.   రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్చేందుకు అవ‌స‌ర‌మైన స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించిన‌ట్లు చెప్పారు. తొలిద‌శ‌లో 0.7శాతం మ‌ర‌ణాలు న‌మోద‌వ్వ‌గా, రెండో విడ‌త 1.02శాతం ఉన్నాయ‌ని అన్నారు. వైద్యులు చెప్పిన జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ, ఇంట్లో ఉండి కూడా వ్యాధినుంచి విముక్తి పొంద‌వ‌చ్చ‌ని  సూచించారు.

వ్యాధిని ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే, అంత త్వ‌ర‌గా న‌యం చేయ‌డానికి వీల‌వుతుంద‌న్నారు. దీనికోసమే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఎవ‌రికైనా జ్వ‌రం ఉంటే, దాయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని, దానివ‌ల్ల న‌ష్ట‌మే ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌న్నారు. నూన్య‌తాభావాన్ని విడ‌నాడి, స్వ‌చ్ఛందంగా ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవాల‌ని,  చికిత్స చేయించుకోవ‌డానికి ధైర్యంగా ముందుకు రావాల‌ని సూచించారు.

ప్ర‌యివేటు ఆసుప‌త్రులు అక్ర‌మాల‌కు పాల్ప‌డితే, క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకుంటామ‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. దీనికోసం ప‌టిష్ట‌మైన నిఘావ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశామ‌ని,  ఫ్ల‌యింగ్ స్క్వాడ్స్త్ తో పాటు, త‌ర‌చూ విజిలెన్స్ త‌నిఖీలు కూడా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌తీఒక్క‌రూ సేవాభావంతో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. జిల్లాలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఇంత‌వ‌ర‌కూ న‌మోదు కాలేద‌ని, దానికి కూడా అవ‌స‌ర‌మైన మందులు, ప్ర‌త్యేక విభాగాన్ని సిద్దం చేశామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాలి- ఎస్‌పి రాజ‌కుమారి

కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప్ర‌జ‌లనుం పూర్తి స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని జిల్లా ఎస్‌పి రాజ‌కుమారి అన్నారు. ప్ర‌జ‌ల్లో ఈ వ్యాధి ప‌ట్ల విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పోలీసు శాఖ త‌ర‌పున 5 ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని, విజ‌య‌న‌గ‌రంలో రెండు, సాలురు, బొబ్బిలి, పార్వ‌తీపురం ఒక్కొక్క‌టి చొప్పున ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పారు. వ్యాధి నియంత్ర‌ణ‌కు 92 కంటైన్‌మెంట్ జోన్ల‌ను ఏర్పాటు చేసి, రాక‌పోక‌ల‌ను నియంత్రించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

అలాగే  జిల్లా వ్యాప్తంగా 12 చెక్‌పోస్టుల‌ను పెట్టామ‌ని, ఉద‌యం 12 గంట‌లు త‌రువాత‌, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తినిస్తున్నామని చెప్పారు. ఇవి కాకుండా ప్ర‌జ‌లు క‌ర్ఫ్యూ స‌మ‌యంలో విచ్చ‌ల‌విడిగా తిర‌గ‌కుండా 13 చోట్ల వాహ‌న త‌నిఖీ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. 41 పెట్రోలింగ్ పార్టీల ద్వారా, 24 గంట‌లూ పోలీసు ప‌హారా ఏర్పాటు చేసి, ఇప్ప‌టివ‌ర‌కూ 279 కేసుల‌ను న‌మోదు చేశామ‌ని లక్షా 24 వేల 488 మందికి జ‌రీమానా విధించిన‌ట్లు తెలిపారు.

అత్యవసరం అయితే ఇ పాస్ పొందండి

జిల్లాలో గానీ, ఇత‌ర జిల్లాల‌కు గానీ క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ఎవ‌రైనా ప్ర‌యాణం చేయాలంటే, త‌ప్ప‌నిస‌రిగా ఇ-పాస్ పొందాల‌ని సూచించారు.  క‌రోనా వ్యాధిని క‌ట్ట‌డి చేయాంటే, ప్ర‌జ‌లు పూర్తిగా స‌హ‌క‌రించి, ఇళ్ల‌లోనే ఉండాల‌ని ఎస్‌పి రాజ‌కుమారి కోరారు.

ఈ మీడియా మీట్ లో జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ జిసి కిషోర్ కుమార్‌, డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, జే.వెంక‌ట‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటీడీఏఏ పీఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్‌, డీఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, స‌మాచార‌, పౌర సంబంధాల‌శాఖ ఎడి డి.ర‌మేష్‌, వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Related posts

మద్యం అక్రమ రవాణాపై విజయనగరం పోలీసుల ఉక్కుపాదం

Satyam NEWS

మూగజీవాల దప్పిక తీరుస్తున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

ములుగు ప్రాంతంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటన

Satyam NEWS

Leave a Comment