32.2 C
Hyderabad
March 28, 2024 21: 47 PM
Slider తెలంగాణ సంపాదకీయం

విలీనం విమోచన మధ్య నలిగిపోవాల్సిందేనా

sardar patel

విలీనమా? విమోచనా? ఈ సంశయం మధ్య ఏండ్లు గడిచిపోతున్నాయి. తెలంగాణ ప్రాంతం మాత్రం స్వాంతంత్ర్యం వచ్చిన రోజును ఎలాంటి అట్టహాసాలు లేకుండా జరుపుకుంటూనే ఉన్నది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రాంతం అంతా కూడా అధికారికంగా స్వాతంత్ర్యం జరుపుకోవాల్సిన రోజు. విలీనం లేదా విమోచన పడికట్టు పదాలు తీసేసి తెలంగాణ స్వాతంత్ర్య దినం అంటే బాగుంటుంది. అన్ని కులాలు, మతాలు, పార్టీల వారూ జరుపుకోవడానికి వీలుంటుంది కానీ ఎవరూ ఆ దిశగా ప్రయత్నం చేయరు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ భారత దేశంలో విలీనమైన రోజును అధికారికంగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవంలాగా జరుపుకునే అవకాశం ఉంటుందని అందరూ భావించారు కానీ ఎందుకో ఆరేళ్లయినా అది జరగలేదు. ముస్లిం రాజును (నవాబు)ను వెళ్లగొట్టి భారత్ లో కలిసినందుకు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే ముస్లిం వర్గాలు ఇబ్బంది పడతాయేమోనని కావచ్చు. లేదా మరే ఇతర రాజకీయమైనా కావచ్చు. నేడు మాత్రం తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం. అధికారికంగా జరిపినా జరపక పోయినా ఇది స్వాతంత్ర్య దినం.  

1948 సెప్టెంబర్ 17వ తేదీ హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్ లో కలిసిన రోజు. ఈ రోజును అధికారికంగా ఎందుకు జరపరు? అనే ప్రశ్న వేసిన ఆనాటి ఉద్యమకారుడు, ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో క్లిప్పింగ్ మాత్రం గత ఆరేళ్లుగా సెప్టెంబర్ 15 నుంచే సోషల్ మీడియాలో విహారం చేస్తూఉంటుంది. సమైక్య ఆంధ్రలో ఆనాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను ఏకవచనంతో సంబోధిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం క్లిప్పింగ్ వైరల్ అవుతూ ఉంటుంది. అయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు.

తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరపరు? ఈ ప్రశ్నకు సమాధానం రాదు. ముస్లింలకు కోపం వస్తుందేమోనని ఆర్టికల్ 370ని ఇంత కాలం భారత్ మోసింది. నరేంద్ర మోడీ రాత్రికి రాత్రి ఆ ఆర్టికల్ ను రద్దు చేసినా దేశంలోని ఏ ముస్లిం కూడా నిరసన తెలపలేదు సరికదా స్వాగతించారు. ఇదే లాజిక్కు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవానికి కూడా వర్తిస్తుంది. తెలంగాణ భారత్ లో విలీనమైన రోజును అధికారికంగా జరిపినా కూడా ముస్లింలు ఏమాత్రం బాధపడరు. ఎందుకంటే ఆనాడు సాయుధ పోరాటం జరిగింది రజాకర్లకు వ్యతిరేకంగా.

రజాకార్లు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడ్డవారు అనేది చరిత్ర తెలిసిన వారెవరైనా చెప్పగలుగుతారు. అలాంటి రజాకార్లకు ఎవరు మాత్రం ఎందుకు మద్దతు ఇస్తారు? తెలంగాణ సాయుధ పోరాటం మత పోరాటం కాదు. మనిషి అస్థిత్వ పోరాటం. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దమనకాండపై పోరాటం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ భారత్ లో కలిసిన రోజును పండుగలా గుర్తించలేదు. ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ నాటి నుంచి పోరాడుతూనే ఉన్న కమ్యూనిస్టుల బలం కూడా ఇప్పుడు రాజకీయంగా తగ్గిపోయింది.

సర్దార్ పటేల్ వల్లే తెలంగాణ భారత్ యూనియన్ లో విలీనం అయిందని చెప్పే బిజెపి రోజు రోజుకూ బలపడుతున్నది. సర్దార్ పటేల్ తెలంగాణ విలీనం తర్వాత నిజాం నవాబును రాజ్ ప్రముఖ్ గా ప్రకటించి ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారని కమ్యూనిస్టులు అంటున్నారు.

ఇవన్నీ గత చరిత్ర. ఈ చరిత్రను ఎవరూ మార్చలేరు. అందుకే విలీనం, విమోచన అనే పదాలను పక్కన పెట్టి తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో ప్రతి సెప్టెంబర్ 17న పండుగ జరుపుకోవడం ఉత్తమమైన విధానం. సర్వజనులూ దీన్ని హర్షిస్తారు. అలా కాకుండా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఆలోచించిన విధంగానే ముస్లింలకు కోపం వస్తుందనే భావనతో ఈ రోజును విస్మరిస్తుంటే మాత్రం రాబోయే రోజుల్లో అధికారంలో ఉన్నవారికి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. బిజెపి స్లోగన్ తెలంగాణలో సజీవంగానే ఉంటుంది.

Related posts

నాలా పనులను పరిశీలించిన మంత్రి తలసాని

Bhavani

ఘనంగా సంతోషి మాత అమ్మవారికి పూజలు

Satyam NEWS

సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా: చంద్రబోస్

Bhavani

Leave a Comment