ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అత్యంత బలహీనంగా ఉన్న ఈ దశలోనే అయోధ్యలోని రామజన్మ భూమి కేసు వివాదం కూడా తేలిపోవాలని బిజెపి భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. బిజెపి అనుకున్నట్లుగానే రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసు విచారణ నేటితో ముగియనున్నది. మంగళవారం రోజు విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఈ అంశంపై కాస్త స్పష్టత నిచ్చారు. తొలుత విచారణ అక్టోబర్ 18 కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువుగా పెట్టుకున్నది. ఇటీవల అక్టోబర్ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. అందువల్ల నేటితో వాదనలు పూర్తి కాబోతున్నట్లు భావిస్తున్నారు. హిందూ, ముస్లిం వర్గాలు ఎదుటి పక్షాల వాదనలపై తమ తమ తుది అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటలవరకు సమయం ఇచ్చే అవకాశముంది. విచారణ ముగుస్తుండటం ఏ సమయంలోనైనా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10 వరకు అయోధ్యలో 144 సెక్షన్ విధించారు. మధ్యవర్తిత్వం విఫలమైన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు 6 నుంచి అయోధ్య కేసుపై రోజువారీ విచారణ చేపడుతోంది. వారం రోజుల దసరా సెలవుల విరామం తర్వాత 14న ముస్లిం వర్గాల వాదనలు పూర్తయ్యాయి. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
previous post