హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఇప్పటి వరకూ దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చివరి నిమిషంలో అక్కడ ప్రచారం చేసేందుకు అంగీకరించారు. రేవంత్ రెడ్డి అభీష్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ పద్మావతిని అభ్యర్ధిగా ప్రకటించింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి గత ఎన్నికలలో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి స్వలప్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో నల్గొండ స్థానం నుంచి ఆయన విజయం సాధించడంతో హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసిన స్థానం నుంచి తన సతీమణి పోటీ చేస్తారని ఏకపక్షంగా చెప్పడం రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నేతలంతా హుజూర్ నగర్ లో ప్రచారం చేశారు కానీ రేవంత్ రెడ్డి ప్రచారానికి రాకపోవడం ఒక లోటుగా ఉంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య అంతగా సఖ్యత లేదు. దాంతో ఆయన సతీమణి, ప్రస్తుత హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి నేరుగా రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ప్రచారం చేయాల్సిందిగా ఆహ్వానించారు. గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నందున రాజకీయాలు పక్కన పెట్టి తన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించు తమ్ముడూ అంటూ పద్మావతి ఆహ్వానించడంతో రేవంత్ రెడ్డి కాదనలేకపోయారు. అందుకే ఈ నెల 18, 19 తేదీలలో రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అంగీకరించారు. రేవంత్ రెడ్డి ప్రచారంతో హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది.
previous post