30.7 C
Hyderabad
April 19, 2024 07: 15 AM
Slider గుంటూరు

కోటప్పకొండ తిరుణాల కోసం ఏర్పాట్లు పూర్తి

#kotappakonda

ఈనెల 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండలో జరగనున్న త్రికోటేశ్వరస్వామి తిరుణాళ్లకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి.శ్రీనివాసరెడ్డి తో కలసి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పరిశీలించారు. తదనంతరం ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులతో మూడవ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందుమాధవ్, చైర్మన్ మెట్టపల్లి రమేష్, ఆలయ ఈవో వేమూరి గోపి తదితరులు పాల్గొన్నారు. తిరుణాళ్ల రోజున కోటప్పకొండకి భక్తులు విచ్చేయు మార్గాలను పరిశీలించి,ఎక్కడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా వాహనాల రాకపోకలకు అనువుగా వుండే విధంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు.

కోటప్పకొండకు ఏఏ ప్రాంతాల నుండి ప్రభలు ఎక్కువగా వస్తాయి? ఎక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది? ఎక్కడ ట్రాఫిక్ మల్లింపు అవసరం ఉంటుంది? ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే దానిని పరిష్కరించడానికి తక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి?వంటి మొదలగు విషయాలు గురించి చర్చించారు. ద్విచక్రవాహనాలు,ఆటోలు,కార్లు,బస్సులు మొదలగు వివిధ వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి,వాహనదారులకు పార్కింగ్ గురించి అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

దేవుని దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన భారీ కేడింగులకు, క్యూలైన్లను పరిశీలించారు. స్నానాల ఘాట్ ను పరిశీలించి, అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భక్తులకు తగిన సూచనలు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. తదనంతరం కొండపై గల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని రాష్ట్ర హోదా కలిగిన ఈ కోటప్పకొండ తిరుణాళ్లను విజయవంతం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గారు,ఇతర శాఖల అధికారులు విశేష కృషిచేస్తున్నారని,వారికి మా పోలీస్ శాఖ సహాయ సహకారాలు ఉంటాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగినంత మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నియమిస్తామని తెలిపారు.

కొండపైనా, కొండ కింద కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసి బందోబస్తులో ఉన్న అందరికి కమ్యూనికేషన్ సెట్లు,వాకీటాకీలు అందించి ఎప్పటికప్పుడు ఆయా ప్రదేశాలలో పరిస్థితులను తెలుసుకుని,దానికి తగినట్లుగా వ్యవహరిస్తామని తెలిపారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీస్ వారిని,ప్రత్యేక బలగాల పోలీస్ వారిని,తగినంత మంది సివిల్ పోలీస్ వారిని నియమించి ఎక్కడైనా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానిని సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఇతర శాఖల అధికారులు కూడా మా పోలీస్ వారికి సహకరించి,అవసరైన చోట తమ సహాయాన్ని అందించాలని, అందరం సమిష్టిగా సమన్వయంతో తిరునాళ్లను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.

మునుపటి ఏడాది జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని అవి మరలా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు కూడా పోలీస్ వారికి సహకరించాలని,వాహనాల పార్కింగ్ వద్ద, దేవుని దర్శన ప్రదేశం వద్ద,కొండకు ప్రభలు తీసుకువచ్చేటప్పుడు పోలీస్ వారి ఆజ్ఞలను పాటించాలని, తద్వారా ప్రశాంత వాతావరణంలో తిరుణాళ్ల జరుపుకోవాలని విజ్ఞప్తి చేసారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలి

Satyam NEWS

మాతృ దేవత

Satyam NEWS

మీరు ఈయనకన్నా బలవంతులా? ఒక్క సారి ఆలోచించండి

Satyam NEWS

Leave a Comment