ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చట్టబద్ధత లేదని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేడు హైకోర్టు వాదనల్లో కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఉన్న సమస్యల్లో భాగంగా ఏపీ ఎస్ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని కేంద్రం రాష్ట్ర హైకోర్టుకు చెప్పడంపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతున్నది. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని, ఆ వాటా టీఎస్ ఆర్టీసీకి ఆటోమేటిక్ గా బదిలీ కాదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో వాదన వినిపించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు వాదనలు వినిపించారు. ఏపిఎస్ఆర్టీసీ విభజన అంశం పూర్తి కానందున టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని కేంద్ర ప్రభుత్వం వాదన వినిపించడంతో తెలంగాణ ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకూ చేస్తున్న వాదనలన్నీ వెనక్కి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తున్నది. కేసును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసిన రాష్ట్ర హైకోర్టు అభిప్రాయానికి అనుగుణంగా ఈ లోపు సిఎం కేసీఆర్ కనీసం పరోక్ష చర్చలకు అయినా మొగ్గు చూపుతారా లేదా అనేది చూడాలి.
previous post