మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కస్టడీలో జరిగిన దాడి వ్యవహారంలో కామేపల్లి తులసిబాబు పాత్రపై ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన వాదనలు వినిపించారు. ముసుగు వేసుకొని వచ్చిన నలుగురు అధికారులు తనను కొట్టారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారని, సాక్షులు సైతం నలుగురు వ్యక్తులు ముసుగు వేసుకొని కార్యాలయంలోకి వచ్చారని వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు.
అయితే, ఒడ్డు, పొడుగు ఆధారంగా తులసిబాబును నిందితుడిగా చేర్చారన్నారు. ఆరోపణలకు నిర్ధిష్ట ఆధారాలు లేనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ తులసిబాబు పోలీస్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయని, కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించే వరకు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.
ఈ కేసులో తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ నేపథంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తులసిబాబు అత్యవసరంగా శుక్రవారం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.