40.2 C
Hyderabad
April 19, 2024 17: 24 PM
Slider సంపాదకీయం

కాంట్రవర్సీ: ఇద్దరు ఐఏఎస్ అధికారులూ, ఒక జగను

lv nimmagadda

పాపం వారిద్దరూ అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపునకు గురి అయిన వారే.

మరీ విచిత్రంగా ఈ ఇద్దరు అధికారులూ కూడా వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో వీరిద్దరూ తీరని అవమానం పాలయ్యారు. తండ్రి చేతిలో అందలం ఎక్కిన వారు తనయుడి చేతిలో అపనిందల పాలయ్యారు.

ఒకరు అయ్యారు మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్ వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అత్యంత సీనియర్ అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యం కు ఫోకల్ పోస్టులు ఇవ్వకుండా చంద్రబాబునాయుడు కాలం గడిపారు.

ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా ఒక చిన్న వివాదం కారణంగా ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యూత్ ఎఫైర్స్ శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ కూడా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు.

ఈ ఇద్దరికి కూడా వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ఎల్ వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖ ను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖ లో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారే.

దుబారా తగ్గించడంలో ఈ ఇద్దరూ కూడా నిష్ణాతులే. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్ వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేది.

భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునేవారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్ లుకా ఉన్నా కూడా ఎల్ వి సుబ్రహ్మణ్యం ఈవోగా ఉన్నప్పుడు, రమేష్ కుమార్ ఈవోగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారు.

వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్ వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు కాదు.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్ వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్ వి ని కొనసాగించగా జగన్ కు ఎంతో మంచి పేరు వచ్చింది.

అయితే అనతి కాలంలోనే ఎల్ విని అత్యంత దారుణంగా, అత్యంత హీనంగా పదవి నుంచి ఆయన తొలగించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా ఇదే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు.

చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కు ఇష్టం లేదు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబు పై వత్తిడి తెచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారు.

అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకున్నారు. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారు.

అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

Related posts

ఈ చీకటి జీవో ముఖ్యమంత్రి సభలకు వర్తించదా?

Bhavani

విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టాలి

Bhavani

ట్రాజెడీ: అలగనూరు బ్రిడ్జిపై కారుబోల్తా పడి ఒకరి మృతి

Satyam NEWS

Leave a Comment