కరోనా ప్రభావం పండగలపై కూడా చూపిస్తోంది. వచ్చే పండగలన్ని జనాల రద్దీతో కూడుకోవడంతో పండగను సాదాసీదాగా జరుపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచన మేరకు ప్రజలు కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు.
కామారెడ్డి పట్టణంలో ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. ముఖ్యంగా పండగ రోజు ఎడ్ల బండ్ల ప్రదర్శన అట్టహాసంగా సాగుతోంది. కానీ ప్రస్తుతం దేశ ప్రజలను కబళిస్తున్న కరోనా వైరస్ బారిన కామారెడ్డి ప్రజలు పడకుండా ఉండేందుకు ఈ సంవత్సరం ఎడ్ల బండ్ల ప్రదర్శనను రద్దు చేశారు.
నేడు వీక్లీ మార్కెట్లో గల మునురుకాపు సంఘం ఫంక్షన్ హాలులో సదరు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమై పండగ విషయమై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, డిఎస్పీ లక్ష్మీనారాయణ పాల్గొని కరోన వైరస్ ప్రభావాన్ని వివరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచనల ప్రకారం ఎడ్ల బండ్ల ప్రదర్శన జరగకుండా చూడాలని సదరు సంఘం ప్రతినిధులను కొరగానే ఈ మేరకు బండ్ల ప్రదర్శన రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేశారు.
కరోన వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదరు సంఘం అధ్యక్షులు రావుల గంగాధర్, గెరిగంటి లక్ష్మీనారాయణ, అన్నారం మోహన్ రెడ్డి, కుంబల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.