తెలంగాణ రాష్ట్రం నుంచి పెసర కొనుగోలు కోటా ఎక్కువ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి లేఖ రాశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి 24.85 % మాత్రమే పెసర కొనుగోలు చేయాలని నిర్దేశించారని ఇది ఏ మూలకూ సరిపోదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మద్దతు ధర బాగుండడంతో రైతులలో ఉత్సాహం ఎక్కువగా ఉందని దానికి తోడు ఈ సారి దిగుబడి ఎక్కువగా ఉంటుందని మంత్రి అన్నారు. మార్కెట్ ధరలకన్న ఎంఎస్పీ ఎక్కువగా ఉండటం వల్ల రైతులు తమకు లాభాలు వస్తాయని ఆశిస్తున్నారని ఆయన అన్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న పరిమాణం 10378 మెట్రిక్ టన్నుల (అంచనా ఉత్పత్తిలో 24.8%) నుండి 20885 మెట్రిక్ టన్నులకు (50%) పెంచాలని ఆయన కోరారు.