ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధి రేటును గణనీయంగా తగ్గించిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. భారత్ వృద్ధి రేటు పై జులైలో అంచనాలను విడుదల చేసిన అంతర్జాతీయ ద్రవ్య నిధి అప్పటిలో 7శాతంగా పేర్కొంది. అయితే తాజాగా తన అంచనాలను మార్చుకుని భారత్ వృద్ధి రేటు కేవలం 6.1 శాతానికే పరిమితం అవుతుందని తెలిపింది. భారత్ వృద్ధి రేటును ఐఎంఎఫ్ ఇంత భారీ స్థాయిలో తగ్గించడంతో దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలలో ఆందోళన కలిగింది. అయితే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి చెబుతున్నారు. నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్ లో ఉన్నారు. ఐఎంఎఫ్ తన వార్షిక నివేదికలో కేవలం భారత్ వృద్ధి రేటును మాత్రమే తగ్గించలేదని ఆమె చెప్పారు. ఐఎంఎఫ్ ప్రపంచంలోని చాలా దేశాల వృద్ధి రేట్లను సవరించిందని, చాలా దేశాల వృద్ధి రేటు తగ్గిందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వృద్ధి రేటు అంచనాలు తగ్గినా కూడా భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉందని ఆమె వెల్లడించారు. భారత్ వృద్ధి రేటు మరింత బాగా పెరిగేందుకు తన శాయశక్తులా తాను కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ ఒకటి అనే దానితోనే తాను సంతృప్తి చెందడం లేదని మరింత వేగంగా అభివృద్ధి సాధించే దిశగానే తాను కృషి చేస్తున్నానని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ తన ఆర్ధిక వ్యవస్థ మూలాలకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకున్నదని, ప్రత్యేకంగా నాన్ బ్యాంకింగ్ రంగ పటిష్టతకు తీసుకుంటున్న చర్యలతో చాలా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ప్రతినిధి క్రిస్టలీనా జార్జీవా వాషింగ్టన్ లో న్యూస్ కాన్ఫరెన్సులో వెల్లడించారు.