పౌరసత్వ చట్ట సవరణపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస మానవ హక్కుల హై కమిషనర్ చీఫ్ మిచెల్ బాచిలొరెట్ ప్రతినిధి జెరెమీ లారెన్స్ మాట్లాడుతూ ఈ చట్ట సవరణలు పౌరసత్వం కోరుకునే ప్రజలపై వివక్షపూరిత ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. పౌరసత్వ చట్ట సవరణతో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలలో మతహింసకు గురైనవారికి భారత పౌరసత్వం లభిస్తుంది.
“భారతదేశ కొత్త పౌరసత్వం (సవరణ) చట్టం 2019 గురించి మేం ఆందోళన చెందుతున్నాం, ఇది ప్రాథమికంగా వివక్షపూరితమైనది” అని జెరెమీ లారెన్స్ విలేకరులతో అన్నారు. ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా, వలస వచ్చిన వారందరికీ వారి మానవ హక్కులను గౌరవించడానికి, రక్షించడానికి అర్హత ఉండాలని లారెన్స్ చెప్పారు.
అణచివేతకు గురైనవారికి రక్షణ కల్పించే లక్ష్యాన్ని స్వాగతించిన ఐరాసా ప్రతినిధి మాట్లాడుతూ, మత వివక్షతో కాకుండా అందరికి పౌరసత్వం ఇవ్వాల్సి ఉందని అన్నారు.”సుప్రీంకోర్టు కొత్త చట్టాన్ని సమీక్షిస్తుందని, అంతర్జాతీయ మానవ హక్కుల బాధ్యతలతో చట్టానికి అనుగుణంగా ఉండేలా చేస్తుందని మేము ఆశిస్తున్నాము” అని ఆమె తెలిపారు.