34.2 C
Hyderabad
April 23, 2024 13: 34 PM
Slider ప్రత్యేకం

అవాంఛనీయ వ్యాఖ్యలతో రెచ్చగొట్టే రాజకీయం

#MinisterKTR

డిసెంబర్ 1 న జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. పాలక తెరాసతో సహా బీజేపీ, కాంగ్రెస్, ఎమ్ ఐ ఎమ్, వామపక్షాలు , టి జె ఎస్ తదితర రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలలో ఓటర్లను ఆకర్షించేందుకు వరాలు గుప్పిస్తున్నాయి.

జీహెచ్ఎమ్ సీ ఎన్నికల ప్రచారపర్వంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయగల ప్రజాస్వామిక విధానాలను విడనాడిన రాజకీయపార్టీలు అవాంఛనీయ వ్యాఖ్యలతో ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న తీరు ప్రజాస్వామ్య ప్రియులకు తీవ్రఆవేదన కలిగిస్తోంది.

లౌకికవాదాన్ని కొత్తనిర్వచనం తో భ్రష్టు పట్టించడం తగదని వారు రాజకీయపార్టీలకు హితవుపలికారు. ఇదిలా ఉండగా… కరోనా మహమ్మారి విలయంతో ప్రజలు అనేకసమస్యలతో సతమతమవుతున్న సమయంలో జీ హెచ్ ఎమ్ సీ ఎన్నికలు నిర్వహించడం సహేతుకం కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత జీ హెచ్ ఎం సీ పదవీకాలం మార్చి 2021 వరకు ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని వాదన వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల హెచ్చుతగ్గుల నేపథ్యంలో జీ హెచ్ ఎమ్ సీ ఎన్నికలకు సిద్ధం కావడం రాజకీయపార్టీల అధికారదాహానికి పరాకాష్టగా ప్రజాస్వామికవాదులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల ప్రచారహోరులో మాస్కులధారణ, భౌతిక దూరం పాటించడం వంటి కనీసజాగ్రత్తలు పాటించడంలో సకల రాజకీయపార్టీలు నిబంధనలు తుంగలోతొక్కిన తీరు శోచనీయం. పండుగల సందర్భంలో కోవిడ్ -19 నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం ఎన్నికల ప్రచార సరళి పై స్పందించకపోవడం అలసత్వానికి దారితీస్తుందని వైద్య, ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అధికారగణం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉన్నట్లు సాంక్రమిక వ్యాధుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన పాలక, ప్రతిపక్ష పార్టీలు కోవిడ్ నిబంధనలు విస్మరించడం బాధ్యతారాహిత్యం.

ప్రజారోగ్యం కంటే అధికారమే పరమావధిగా భావించే నేతలు ఉన్నంతకాలం సామాన్యులకు వెతలు తప్పవు.. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రచారం చేసుకోవాలని రాజకీయపార్టీలకు సూచిస్తే ఉభయ శ్రేయస్కరం.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

ఉపాధ్యాయుల సీనియార్టీ లిస్టు తప్పులు లేకుండా రూపొందించాలి

Satyam NEWS

ఈనెల 28, 29 తేదీలలో దేశవ్యాప్త సమ్మె

Sub Editor 2

ఫైర్ ఎగెన్: మళ్లీ కదిలిన కాపు రిజర్వేషన్ అంశం

Satyam NEWS

Leave a Comment