కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం కోతకు గురవుతున్న సముద్ర తీర ప్రాంత రక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, డీఎఫ్ఓ ఎస్.భరణి, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్- మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్, సైన్స్ (ఎన్.సీ.సీ.ఆర్) జాయింట్ సెక్రటరీ డా.రమణ మూర్తి, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
నేమామం, ఉప్పాడ గ్రామాల్లో కోతకు గురవుతున్న సముద్ర తీర ప్రాంత, హోప్ ఐలాండ్ ప్రాముఖ్యత, ఫిషింగ్ హార్బర్, కాకినాడ సీపోర్ట్ కార్యకలాపాలు, మడ అడవుల పరిరక్షణ, గత నలభై ఏళ్లుగా కోతకు గురైన తీరప్రాంతం, ఇతర ప్రాంతాల్లో సముద్రతీరం రక్షణకు చేపట్టిన చర్యలు, కాకినాడ పోర్టు నుంచి ఉప్పాడ వరకు తీరప్రాంతానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టులు వంటి అంశాలపై రెవిన్యూ, పంచాయతీ, రోడ్డు భవనాల, ఏపీఐఐసీ, కౌడా, సర్వే, మత్స్య, ఇరిగేషన్, చేనేత, టూరిజం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడేందుకు అవసరమైన ప్రణాళికలు రూపకల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు సంబంధించి తీర ప్రాంతలో వివిధ శాఖల ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలు, భవిష్యత్తు అవసరాలు, తీర ప్రాంతంలోని వివిధ వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన సూచనలు తెలియజేయాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు.
ఉప్పాడ సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు, ఉప్పాడ తీరంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది? దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా రక్షణ చర్యలపై ఎన్.సీ.సీ.ఆర్ జాయింట్ సెక్రటరీ డా.రమణ మూర్తి, ఇతర బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డా.డి.తిప్పేనాయక్, కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్, పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు, రోడ్డు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కాంతు, జిల్లా మత్స్య శాఖాధికారి కరుణాకర్, ఏపీఐఐసీ జేడ్ఎం ఎం.రమణారెడ్డి, టూరిజం, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.