అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలకు ఇస్తున్న ఆర్ధిక సాయాన్ని నిలిపివేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. యుద్ధంలో చిక్కుకుని విలవిలలాడుతున్న ఉక్రేయిన్ కూడా ఆర్ధిక సాయం నిలిపివేసిన జాబితాలో ఉన్నది. ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లకు మాత్రం సైనిక బలగాల పెంపు కోసం ఖర్చు చేసే నిధులను మాత్రం ఇందులో నుంచి మినహాయింపులు ఇచ్చారు. అధికారం చేపట్టిన కొద్ది గంటల తర్వాత ట్రంప్ తన విదేశాంగ విధానంలో భారీ మార్పులు చేశారు. పెండింగ్‌లో ఉన్న విదేశీ అభివృద్ధి సహాయానికి 90 రోజుల విరామం ఇవ్వాలని ఆదేశించారు.
ఇలా అంతర్జాతీయ సహాయం స్తంభింపజేయడం వలన అంతర్జాతీయ భాగస్వాములు ఇతర దేశాలను ఆశ్రయించే అవకాశం కలుగుతుందని దీనివల్ల అమెరికాకు పోటీగా నిలిచే దేశాలు, అమెరికా విరోధులు బలపడే అవకాశం ఉందని ట్రంప్ విమర్శకులు అంటున్నారు. ఎవరు ఎంత విమర్శించినా కూడా స్టేట్ డిపార్ట్‌మెంట్ మెమో తక్షణమే అమలులోకి వస్తుంది. అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) మాజీ సీనియర్ అధికారి ఒకరు దీనిపై వ్యాఖ్యానిస్తూ ఇది అనవసర గందరగోళానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రాణాలను రక్షించే ఆరోగ్య సేవలు, HIV/AIDS, పోషకాహారం, మాతా మరియు శిశు ఆరోగ్యం, అన్ని వ్యవసాయ పనులు, పౌర సమాజ సంస్థలు, విద్యకు మద్దతు లాంటి పనులు నిలిపివేయడం మంచిదికాదని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ పై పాలస్తీనా మిలిటెంట్లు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఆదివారం ప్రారంభమైన తర్వాత గాజా స్ట్రిప్‌లోకి మానవతావాద సహాయం పెరగడంతో ఎంతో మంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజా ఆదేశాలతో సూడాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర ఆకలి దేశాలు సంక్షోభంలోకి వెళ్లిపోతాయి.
ఇజ్రాయెల్ ఈ సంవత్సరానికి $3.3 బిలియన్ల విదేశీ మిలిటరీ ఫైనాన్సింగ్‌ను అందుకుంటుంది. ఈజిప్ట్ సుమారు $1.3 బిలియన్లను అందుకుంటుంది. 2025లో ఇటువంటి ఫైనాన్సింగ్ కోసం గుర్తించబడిన ఇతర రాష్ట్రాల్లో ఉక్రెయిన్, జార్జియా, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, జిబౌటీ, కొలంబియా, పనామా, ఈక్వెడార్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ మరియు జోర్డాన్ ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు జో బిడెన్ ఈ దేశాలకు ఇతోధికంగా సాయం చేసేవారు.