24.7 C
Hyderabad
March 29, 2024 05: 51 AM
Slider ముఖ్యంశాలు

దళిత బంధు ఉపయోగించుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలి

#udaykumar

దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు అందరూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు.  దళిత సామాజిక వర్గం ఆర్థికంగా పరిపుష్టి, ఆర్థిక సాధికారత సాధించడమే కాకుండా ఆత్మ గౌరవంతో బతకాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర రావు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. 

శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలంలో దళిత బంధు పథకం పై లబ్ధిదారులకు  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని ఆర్థికంగా సామాజికంగా పరిపుష్టి చేసేవిధంగా  దళితబంధు పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.  ఈ పథకం అమలుకు ఈ సంవత్సరం బడ్జెట్ లో 17,770 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. 

పథకాన్ని విడతల వారిగా రాష్ట్రంలోని మిగిలిన సామాజిక వర్గాలకు సైతం అమలు చేయడం ఖాయమని పేర్కొన్నారు.   దళితులు ధైర్యంగా , నిరుత్సాహంగా ఉండటానికి ప్రధాన కారణం గత ప్రభుత్వాలు ఆదరించకపోవడమేనని అన్నారు.   దళితబంధు ప్రతి దళితునికి అందాలనే ఉద్దేశ్యం తో ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులను అందరిని సంప్రదించి ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. 

ప్రతిపక్షాలు దళితులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయడం, ఫోటోలు దిగి ప్రచారాలు చేసుకోవడం తప్ప ఏనాడు దళితులకు మనస్ఫూర్తిగా సహకారం అందించలేదని విమర్శించారు.  రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రజలు దళితబంధు పథకాన్ని తమ రాష్ట్రంలో సైతం అమలు చేయాలని ఉద్యమాలు చేసే రోజులు వస్తాయని అన్నారు. 

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లల ద్వారా తాగు నీరు ఇచ్చే పథకంలో కేంద్రం నుండి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉన్నా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 4 మండలాల్లో దళితబంధు అమలు చేస్తే దక్షిణ తెలంగాణలో చారగొండ మండలాన్ని ఎంపిక చేయడంలో ప్రధాన కారణం తానే అని తెలిపారు. 

దళితబంధు నిధులతో అందరూ ఒకే రకమైన యూనిట్లు నెలకొల్పకుండా  తమ ఇంట్లో బాగా ఆలోచించి ఏ రకమైన యూనిట్ పెడితే లాభదాయకంగా ఉంటుందో ఆలోచించించుకొని అదే విషయం ప్రత్యేక  కమిటీలో ఉన్న అధికారులు, కలెక్టర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. 

యూనిట్ ప్రారంభించేందుకు కావకాసిన  డి.పి.ఆర్. , సాంకేతిక సహాయం కమిటీలోని అధికారులు అందజేస్తారన్నారు.  ఒకరు ఒక యూనిట్ మాత్రమే కాకుండా అవే డబ్బులతో రెండు మూడు యూనిట్లు పెట్టుకోవచ్చని, లేదా కొంతమంది లబ్ధిదారులు కలిసి ఒక పెద్ద యూనిట్ ను పెట్టుకోవాలని తెలియజేసారు. 

ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, దళారిగా వ్యవహరించిన, డబ్బులు పక్కదారి పట్టినా అట్టివారిని జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. తాను పేదరికం నుండి అప్పు చేసి వ్యాపారం చేసి ఈ స్థాయికి ఎడిగానని అందువల్ల ప్రతి పెదవాని తరపున నేనుంటానని, పెద్దవాళ్ళ గొంతుక అవుతానని భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద చారగొండ మండలాన్ని ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి,  అందుకు కృషి  చేసిన శాసన సభ్యులు గువ్వల బాలరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. 

ఇంతకు ముందు దళిత సామాజిక వర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి దళితుల సాధికారతకు కృషిచేయడం జరుగుతుందన్నారు.   ఈ డబ్బులను దళితులు తమ స్వంత అవసరాలకు కాకుండా వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదగడానికి వినియోగించాలని తెలియజేసారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ  పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన చారగొండలోని 13 గ్రామాల్లో ఇప్పటి వరకు దాదాపు 1580 మంది లబ్దిదారులు యూనిట్ల ఎంపిక చేసుకోవడం జరిగిందని, మొదటి విడతగా ఈ రోజు సాయంత్రం వరకు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 

ఎవరు ఏ యూనిట్ పెట్టుకుంటారు వారికి సాంకేతిక సహకారం అందించడానికి 4 కమిటీలను నియమించడం జరిగిందన్నారు.  డైరీ, మినీడైరీ వంటి యూనిట్ల ఏర్పాటుకు షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని అందువల్ల వారికి నేటి సాయంత్రం మొదటి విడత డబ్బులు అకౌంట్ లకు బదిలీ చేయడం జరుగుతుందన్నారు.  మిగతావారు ఏ యూనిట్ కు సప్లయ్ చేసే ఏజెన్సీ పూర్తి వివరాలు అందిస్తే వారి అకౌంట్లకు నిధులు బదిలీ చేయడం జరుగుతుందన్నారు.  ఒక్కరొక్కరే కాకుండా కొంత మంది కలిసి ఒక పెద్ద యూనిట్ ను నెలకొల్పే విధంగా ఆలోచించాలని సూచించారు. 

కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ  దళితుల ఆర్థిక సాధికారత కై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన దళితబంధు పథకాన్ని ఇప్పటికే హుజూరాబాద్ లో 21 వేల కుటుంబాలకు, వాసాలమర్రి లో 75 కుటుంబాలకు గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. 

సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే కాకుండా వలస వెళ్లిన దళిత కుటుంబాలు, పెళ్లి తర్వాత వేరు అయిన కుటుంబాలు ప్రతి ఒక్కరినీ గుర్తించి దళితబంధు పథకం లబ్ది చేకూర్చాలని కోరారు.   ఇప్పటి వరకు రిటేల్ షాప్ రంగంలో  414 యూనిట్లు,ట్రాన్స్పోర్ట్ రంగంలో 308, సప్లై రంగంలో 542, సర్వీస్ రంగంలో 18 ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు.  రాబోయే రోజుల్లో 2 లక్షల కుటుంబాలకు దళితబంధు లబ్ది చేకూర్చడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అసమానతలకు గురైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్థిక అసమానతలకు గురైన దళిత సామాజిక వర్గానికి ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టని దళితబంధు పథకాన్ని తెలంగాణాలో ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు.  అందరూ ఒకే రకమైన యూనిట్ పెట్టకుండా వేరే వేరే యూనిట్లు పెట్టుకొని తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమం చివరలో  అనుకోని అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంతరించిపోతున్న కళలను గుర్తించి కాపాడుతుందని కొనియాడారు.  తనకు పద్మశ్రీ అవార్డు రావడం, కోటి రూపాయలు  మంజూరు, 300 గజాల స్థలం హైదరాబాద్ లో వచ్చేవిధంగా సహకారం అందించిన శాసన సభ్యులు గువ్వల బాలరాజ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజేందర్ గౌడ్, పి.ఏ.సి.ఎస్ కన్వీనర్ గురువయ్య గౌడ్, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి వెంకటయ్య యాదవ్, ఎంపిటిసి శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు.  లబ్ది దారులు భారి సంఖ్య లో, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది: మూడు రాజధానుల్లో న్యాయ రాజధాని దిశగా అడుగులు

Satyam NEWS

అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనండి

Bhavani

జగన్‌కి హ్యాండ్‌ ఇస్తున్న వైసీపీ ఎంపీలు

Satyam NEWS

Leave a Comment