38.2 C
Hyderabad
April 25, 2024 14: 34 PM
Slider ప్రపంచం

ఎనాలసిస్: మళ్లీ లాక్ డౌన్ వైపు చూస్తున్న పలుదేశాలు

#Lockdown Again

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ఉద్ధృతి  పెచ్చరిల్లుతున్న  నేపథ్యంలో చాలా దేశాలు మళ్లీ లాక్డవున్ విధింపు ప్రకటన దిశగా యోచిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కారణంగా నెలలతరబడి లాక్డవున్ విధించడంతో దేశాల ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ప్రజాసంక్షేమంతో పాటు ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటూ అవసరమని  చాలా దేశాలలో దశలవారీగా లాక్డవున్ సడలింపులు చోటుచేసుకున్నాయి.

అయితే….ప్రజల నిర్లక్ష్యం,ప్రభుత్వాల అలసత్వం  కారణంగా రోజురోజుకూ  వైరస్ బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా వైరస్ బారిన పడగా 5 లక్షలపై చిలుకు మృత్యువాత పడినట్లు తాజా సమాచారం. ఒక్క అమెరికా లోనే మొత్తం కేసులు 26 లక్షలు దాటగా 1లక్షా 20వేల పైగా మరణాలు చోటుచేసుకోవడం శోచనీయం.

దడపుట్టిస్తూనే ఉన్న కోవిడ్ 19

బ్రెజిల్, రష్యా, భారత్, యూకే, స్పెయిన్  దేశాలతోపాటు చాలా దేశాలలో కరోనా వైరస్ విస్తరణ దడ పుట్టిస్తోంది. భూటాన్, శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలలో కరోనా ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టినా సమీప భవిష్యత్తులో వైరస్ విజృంభించే ప్రమాదం పొంచిఉన్నట్లు అంతర్జాతీయ సాంక్రమికవ్యాధుల నిపుణుల బృందం అంచనా వేస్తోంది.

కోవిడ్-19 పుట్టిన చైనా లో కూడా హూబీ ప్రావిన్స్ ప్రాంతంలో కొత్తగా  కేసులు  వెలుగులోకి వస్తున్నట్లు చైనా కు చెందిన వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రపంచఆరోగ్య సంస్థ సైతం కరోనా ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

మరణాల సంఖ్య శాతంలో ఎలాంటి మార్పులేదు

శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మానవాళి మనుగడను ఇప్పటికే శాసిస్తూనే ఉంది. ప్రతీ లక్షమంది జనాభాకి యూకేలో 64,స్పెయిన్ లో 60, ఇటలీలో 57, అమెరికాలో 36, పెరూలో 25, భారత్ లో 1 మరణం చోటుచేసుకుంటున్న తీరు ఆయాదేశాలను వణికిస్తోంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) తాజా అంచనా ప్రకారం… కరోనా వైరస్ బారిన పడినవారిలో ఆసుపత్రిలో చేరకుండానే 80 శాతం కేసులను అదుపుచేయవచ్చని భరోసా ఇస్తోంది.

ఆసుపత్రిలో చేరిన కేసులలో 15 శాతం రోగులు  కోలుకొంటున్నట్లు…విషమించి న 5 శాతం వ్యాధిగ్రస్తులలో కేవలం సగంమందికే ప్రాణాపాయం ఉన్నట్లు డబ్ల్యూ హెచ్ ఓ అంచనా వేసింది. కరోనా రెండవ విడత విజృంభణ తీవ్ర స్థాయిలో ఉండగలదని దేశీయ, విదేశీ వైద్య నిపుణులు మొదటినుంచీ రాగల ప్రమాదాన్ని సూచిస్తూనే ఉన్నారు.

ఇంకా సమయం పడుతున్న కోవిడ్ వ్యాక్సిన్

కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణ కు అనువైన వాక్సిన్ వినియోగంలోకి వచ్చేందుకు ఇంకా సమయం పట్టగలదని తెలుస్తోంది. పలు ప్రాంతాలలో కొనసాగుతున్న ప్రయోగాలు, సామర్థ్య పరీక్షల  దశలోనే ఉన్నాయి. ప్రాణాంతక వ్యాధిని అంతమొందించే దిశగా సాగుతున్న ముమ్మర  ప్రయత్నాలు ఫలవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

  కానీ…పెరుగుతున్న కరోనా కేసులు  ప్రభావిత దేశాలలో మరోసారి  లాక్డవున్ విధించే పరిస్థితులు కల్పిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి నిరోధించడానికి లాక్డవున్ మించిన సాధనం వేరొకటి లేదని విశ్వసిస్తున్నాయి. లాక్డవున్ అమలులో ఉన్న దేశాలలో వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

థాయిలాండ్ లో జులై నెల 1న ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డవున్ విరమించాల్సివుంది. కానీ… పెరుగుతున్న కొత్త కేసులు దృష్టా లాక్డవున్ పొడిగింపు అనివార్యమని తెలుస్తోంది. తాజాగా జర్మనీలో 5 లక్షలమంది కొత్తగా విధించిన లాక్డవున్ పరిధిలో ఉన్నట్లు సమాచారం.

మాల్స్ ప్రార్ధనా మందిరాలు తెరిస్తే ఇక అంతే…

బీబీసీ ఇటీవలి సర్వే ప్రకారం జూన్ 8 నుంచి రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, ప్రార్దనా మందిరాలు తెరవడం వలన కొత్తగా కేసులు ఆదేశంలో  పుట్టుకొచ్చినట్లు తేలింది. దక్షిణాఫ్రికాలో జూన్ 18 న లాక్డవున్ ఎత్తివేసిన నాటినుంచి కేసులు నమోదుకావడం గమనార్హం.

ఆస్ట్రేలియా లో కూడా జులై నెల మొదటినుంచి లాక్డవున్ సడలింపులు ఉండగలవని ప్రభుత్వం ప్రకటించినా… ప్రస్తుత పరిస్థితుల్లో మరికొంతకాలం లాక్డవున్ పొడిగింపుకు మొగ్గు కనిపిస్తోంది. లాక్డవున్ దశలవారీ విరమణా నంతరం స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియాలలో మిశ్రమ ఫలితాలు చోటుచేసుకున్నాయి.

భారత్  లో పరిస్థితి మెరుగ్గా లేదు

భారత్ విషయానికి వస్తే…కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తోంది. అనునిత్యం కొత్తగా కరోనా కాటుకు బలవుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలో సుమారు 20 వేల కొత్తకేసులు నమోదుకావడం ఆందోళన కలిగించే అంశం.

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులలో సంఖ్యా పరంగా 5 లక్షలు దాటేశాం.  మరణాల రేటు, రికవరీ రేటు మిగతా దేశాలతో పోల్చుకుని తక్కువగా ఉన్నామని సంబరపడడం మంచిది కాదని …రానున్న రోజుల్లో కరోనా ఉద్ధృతమయ్యే ప్రమాదం భారతదేశానికీ తప్ప దని వైరస్ కారక వ్యాధి నిర్ధారణ  వైద్యబృందాల చర్చలలో  వినిపిస్తోంది. ఇటువంటి దుర్భరస్థితిలో మానవాళిని వైరస్ బారినుంచి తప్పించేందుకు కఠిన లాక్డవున్ విధింపు  ఒక్కటే శరణ్యమని ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఏకీభవించడం విశేషం.

భవిష్యత్తులో మరింత అప్రమత్తత అవసరం

వైరస్ విస్ఫోటానం హఠాత్తుగా సంభవిస్తే తట్టుకోగల శక్తిసామర్ధ్యాలను మదింపు చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకతల్ని  ప్రపంచ దేశాలు గుర్తిస్తే   ప్రమాద స్థాయిని అరికట్టేందుకు వీలుంటుందని డబ్ల్యూ హెచ్ ఓ పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కసారిగా వైరస్  మానవవా ళి పై దాడిచేస్తే….సరిపడా ఐసోలేషన్ వార్డులు, చికిత్సా సాధనాలు, పీపీఈ సురక్షిత కిట్లు, ఔషధాలు , మానవవనరులతో కూడిన ఆసుపత్రులు తగిన సంఖ్యలో ఉంచాల్సిన బాధ్యతను ఆయాదేశాలు చేపట్టాల్సిన క్లిష్టదశలో ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణ పరిస్థితులలో ప్రతీ వెయ్యి మంది ప్రజలకు ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలని మార్గదర్శకాలు చెబుతున్నా..భారత్ సహా చాలా దేశాలలో ఆచరణకు చాలా దూరంగా ఉన్నట్లు ప్రభుత్వాలే ఒప్పుకోవడం బాధాకరం. ప్రజారోగ్యం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న సమయంలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాల్సిన అవసరం ప్రభుత్వాలు గుర్తించాల్సిన తక్షణ కర్తవ్యం. పొలమరశెట్టి కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

ఎన్నికల్లో సమర్ధవంతంగా పని చేసిన సిబ్బందికి  ప్రశంసలు

Satyam NEWS

కాస్ట్ ఫీలింగ్: కాపు నేస్తం కాదు… కాపు దగా !

Satyam NEWS

కోవర్టులు: అటు ఇటు మారుతున్న తమ్ముళ్లు

Satyam NEWS

Leave a Comment