30.2 C
Hyderabad
September 14, 2024 17: 08 PM
Slider సంపాదకీయం

ఏవి స్వామీ నీవు చెప్పిన విలువలు?

venkaiahnaidu

తెలుగు రాష్ట్రాల్లో పచ్చ మీడియా ఏ విషయాన్ని అయినా పెంచి పెద్దది చేయాలన్నా మొగ్గలోనే తుంచేయాలన్నా విశేష ప్రతిభ చూపిస్తుంటుంది. గతంలో చాలా సంఘటనలు ఇలాంటివి ఉన్నాయి. తాజా ఉదాహరణగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితి. ఆయన అకస్మాత్తుగా మిన్నసోటా వెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆయన ఎంతో ఆనందంగా ఉన్నట్లు, ఆయన మిన్నసోటా వెళ్లి రోడ్డు పక్కన విహారం చేస్తూ పల్లీలు తింటున్నట్లు పిక్చర్ ఇచ్చింది తప్ప ఆయన అక్కడ ఉన్నప్పుడు గానీ, ఆయన తిరిగి వచ్చిన తర్వాత గానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు రాయలేదు. సత్యం న్యూస్ కు పచ్చ తెగులు లేదు కాబట్టి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విశ్లేషణ ఇచ్చింది. పదుగురి ప్రశంసలు అందుకుంది. ఇలా పచ్చ మీడియా దాచిపెట్టిన లేదా తొక్కి పెట్టిన మరో అతి పెద్ద సంఘటన ఏదంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఒక్క గెంతుతో బిజెపిలో చేరడం. అదేదో సాధారణమైన విషయంలాగా ‘ఆ రెండు’ పత్రికలు తేల్చేశాయి తప్ప వాటి గురించి రాయడంలేదు. ఈ ఫిరాయింపుల గురించి చంద్రబాబునాయుడు కూడా పెదవి విప్పడం లేదు. చంద్రబాబుకు అత్యంత వీర విధేయులు( ఒక్క టి జి వెంకటేష్ తప్ప) చంద్రబాబునాయుడితో ఆర్ధిక సంబంధాలు కూడా ఉన్న సుజనా చౌదరి, సి ఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు పార్టీ జంప్ చేస్తే పచ్చ మీడియా రెండు రోజులు వార్తలు రాసేసి ఊరుకుంది. టాపిక్ డైవర్ట్ చేసేసింది. ఇప్పుడు ఆ నలుగురు బిజెపిలోనే పుట్టినట్లు, బిజెపిలోనే పెరిగినట్లు, బిజెపిలోనే ఎంపిలు అయినట్లు వార్తలు రాసేస్తున్నారు. పైగా సి ఎం రమేష్ బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు, రాజ్యసభలో మెజారిటీని సి ఎం రమేషే తెచ్చేసినట్లు, దానికి అమిత్ షా శభాష్ అన్నట్లు కూడా పుంఖాను పుంఖాలుగా రాసేస్తున్నాయి. అలాగే సుజనా చౌదరికి మంత్రి పదవి వచ్చేస్తున్నట్లు కూడా రాసేశాయి. ఆంధ్రాలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జి వి ఎల్ నర్సింహారావుకు ఎక్కడ మంత్రి పదవి వచ్చేస్తుందో అనే ఆందోళనలో పచ్చమీడియా ఇటు సి ఎం రమేష్ ను అటు సుజనా చౌదరిని పెద్దగా చూపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ నలుగురు తెలుగుదేశం నాయకులు చేసిన పార్టీ ఫిరాయింపు నకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆగమేఘాలపై నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఇంత కాలం పార్టీ ఫిరాయింపులపై ఆయన చెప్పిన నీతులు ఏమయ్యాయి? పార్టీ ఫిరాయించడం కన్నతల్లికి ద్రోహం చేసినట్లుగా కూడా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఏమయ్యాయి? ఏ పార్టీ మారకుండా నేను ఒకే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను- అంత నీతివంతుడిని అని ఆయన చెప్పిన మాటలు ఏమయ్యాయి? సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టి జి వెంకటేష్ బిజెపి నుంచి రాజ్యసభకు ఎన్నిక కాలేదు మరి అలాంటప్పుడు వారిని బిజెపి సభ్యులుగా రాజ్యసభ చైర్మన్ ఎలా గుర్తిస్తారు? తన రాజకీయ జీవితంలో ఎంతో సాధించిన వెంకయ్య నాయుడు ఈ ఒక్క చర్యతో తన విలువలను కోల్పోలేదా? (నిబంధనల గురించి మాట్లాడవద్దు. వాటిని ఎలాగైనా ఇంటర్ ప్రెట్ చేయవచ్చు) తెలంగాణ గత అసెంబ్లీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ లో అప్పటి స్పీకర్ లు పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి చర్య తీసుకోకుండా ఐదేళ్లూ గడిపేశారు. మరి అవే నిబంధనల ప్రకారం కర్నాటక అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ తన విచక్షణ ఉపయోగించి పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించారు. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని శీతారాం ఒక మాట అన్నారు- రాజ్యసభ చైర్మన్ గా ఉంటే తాను ఆ నిర్ణయం తీసుకుని ఉండేవాడిని కాదు – రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్యనాయుడు తీసుకున్న అతి పెద్ద అనైతిక చర్యగా దీన్ని చెప్పవచ్చు. రాజ్యసభలో బిజెపికి మెజారిటీ తెచ్చేందుకు తాము చేరుతున్నామని ఫిరాయింపు దారులు అప్పటిలో చెప్పారు. రాజ్యసభలో బిజెపికి మెజారిటీ వచ్చేందుకు అనైతికంగా వెంకయ్యనాయుడు సహకరించినట్లే కదా? నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపి సభ్యులుగా గుర్తించడం అంటే ఇదే అర్ధం వస్తుంది. వెంకయ్యనాయుడు చేసిన ఈ చర్య సమర్ధనీయమైతే ఆనాడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చేసింది కూడా తప్పు కాదు. అలాగే మండలి చైర్మన్లు తీసుకున్న నిర్ణయమూ తప్పు కాదు. అదే విధంగా ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని టి ఆర్ ఎస్ లో విలీనం చేయడమూ తప్పు కాదు. గోవా, మణిపూర్, కర్నాటక, ఈశాన్య రాష్ట్రాలలో స్పీకర్లు తీసుకున్న నిర్ణయాలూ తప్పు కాదు. ప్రభుత్వాలను పడగొట్టడం, అనైతికంగా మెజారిటీలు తెచ్చుకోవడమూ తప్పు కాదు. స్పీకర్ ల విధుల్లో జోక్యం చేసుకోలేం అని న్యాయస్థానాలు చెప్పడమూ సమర్ధనీయమే. రాజ్యసభలో ఉన్నమెజారిటీ సభ్యులు బిజెపిలో చేరిపోతే తెలుగుదేశం పార్టీ మౌనంగా ఎందుకు ఉన్నది అనేది కూడా ప్రధాన ప్రశ్న. చిన్న విషయం జరిగితే అరిచి గొడవ చేసే తెలుగుదేశం, పచ్చ మీడియాలు దీన్ని ఎందుకు హైలైట్ చేయడం లేదు? కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక భవనం కూలగొడితే చేసినంత గొడవ కూడా నలుగురు పార్టీ ఎంపిలు బిజెపిలో చేరితే చేయలేదు. అంటే దీనికి చంద్రబాబు ఎండార్సుమెంటు ఉన్నట్లేనా? అందుకేనా ‘ఆ రెండు పత్రికలు’ గమ్మున కూర్చున్నది? వెంకయ్యనాయుడికి మచ్చపడుతుందనేనా? గుంభనంగా ఆ విషయాన్ని దాటవేసింది???

Related posts

దివాకర్ ట్రావెల్స్ మూతపడే వరకూ వదలరేమో

Satyam NEWS

వైన్స్ షాపుల వద్ద మద్యం ప్రియుల భారీ క్యూ

Satyam NEWS

గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment