పాలన ఒక్క చోట నుంచే ఉండాలనేది నా నిశ్చితాభిప్రాయం అని కుండ బద్దలుకొట్టారు భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. ముఖ్యమంత్రి, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నన్ను అడిగితే నేను ఇదే అభిప్రాయం చెపుతానని వెంకయ్యనాయుడు అన్నారు.
స్వర్ణ భారతి ట్రస్ట్ లో నేడు మీడియా తో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొద్ది సేపు మాట్లాడారు. అన్ని ఒక్క చోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుంది. అయితే అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం అని ఆయన అన్నారు. నా 42 ఏళ్ళ అనుభవం తో ఈ మాట చెపుతున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు.
వివాదం కోసమో, రాజకీయం కోణం లోనో తన అభిప్రాయం చూడవద్దని ఆయన కోరారు. కేంద్ర మంత్రి గా నాడు ప్రత్యేకం గా చొరవ తీసుకుని జిల్లాకో కేంద్ర సంస్థ ఏర్పాటు అయ్యేలా చూసానని ఆయన వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలా జరగాలి కానీ వేరే విధంగా కాదని వెంకయ్యనాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్ర సంస్థ లను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. మాతృభాష కు ప్రాధాన్యం విషయం లో నాది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు లో ప్రాధమిక బోధన ఉండాలనేదే నా అభిప్రాయం. ప్రధాని సైతం మాతృ భాష కు ప్రాధాన్యం పై అనేక సార్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు.