తన దాకా వస్తే గానీ… ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం అంటే ఏమిటో తెలియనట్టే ఫోజులు కొట్టిన కడప జిల్లా వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు వర్రా రవీంద్రా రెడ్డి… ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఇలా అడగ్గానే అలా నిజాలు ఒప్పేసుకుంటున్నాడు. సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనితలతో పాటు జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టుగా వర్రా ఒప్పేసుకున్నాడు.
అంతేనా… ఆయా నేతలపై అలాంటి అసభ్యకర పోస్టులు పెట్టమని తనను ఎవరు ప్రోత్సహించారన్న విషయాన్ని కూడా వర్రా పోలీసులకు చెప్పేశాడట. ఫలితంగా వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీగా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డితో పాటుగా ఆయన తండ్రి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై వర్రాపై కేసులు నమోదు కాగా… ఆయన కోసం కడప పోలీసులు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టి చివరకు అరెస్ట్ చేశారు.
తాజాగా ఈ కేసులో మరిన్ని వాస్తవాలను వెలికితీయాల్సి ఉందని… అందుకోసం వర్రాను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు కడప పోలీసులు వర్రాను తమ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా వర్రా పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు సజ్జల భార్గవ రెడ్డితో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డిలు చెబితేనే… తాను నేతలపై అసభ్య పోస్టులు పెట్టానని అతడు చెప్పాడు. సదరు పోస్టులు పెట్టినందుకు తనకు ఇస్తానన్న డబ్బును కూడా భార్గవ రెడ్డి తనకు ఇవ్వలేదన్నారు.
తన పేరు చెప్పుకుని భార్గవరెడ్డి సొమ్ములు తన జేబులో వేసుకున్నారని తెలిపాడు. ఇక పార్టీ అండగా ఉంటుంది.. భవిష్యత్తులో మంచి పదవులు దక్కుతాయి అంటూ బార్గవ రెడ్డితో పాటు రామకృష్ణారెడ్డి కూడా చెప్పారని… దీంతోనే పోస్టులు పెట్టినట్లు అతడు చెప్పాడు. పోలీసుల కస్టడీలో వర్రా రివర్స్ గేర్ వేసిన వైనం తెలిసిన వెంటనే సజ్జల ద్వయం హడలిపోయిందట. ఇప్పటికే రామకృష్ణారెడ్డిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆయనపై ఏకంగా లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయ్యింది.
పలు కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సజ్జల సీనియర్ తన పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందోనన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక సజ్జల జూనియర్ విషయానికి వస్తే… సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో ఈయన కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే విదేశాలకు పారిపోతారన్న కారణంగా సజ్జల జూనియర్ పైనా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతా తామే చేశామంటూ వర్రా లాంటి వారే చెబితే… ఇక తమమ పని అయిపోయినట్లేనని వారు భయపడిపోతున్నారు.