అల్లుడితో కలిసి వెంకీ మామ గా వచ్చేస్తున్న విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత కూడా ఆగేలా కనిపించడం లేదు. గత కొంత కాలంగా కామెడీ ప్రధానంగా ఉన్న సినిమాలు చేసిన వెంకీ ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు మాత్రమే చేశాడు. ఇప్పుడు వచ్చే వెంకీ మామ కూడా మల్టీ స్టారే. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా అనౌన్స్ చేసిన విక్టరీ వెంకటేష్ అది సెట్స్ పైకి వెళ్లేలోపు మరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. పెళ్లి చూపులుతో మొదటి సినిమాకే మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ గుర్రపు పందాల నేపథ్యంలో మంచి కథని రెడీ చేశాడట. గుర్రపు పందాల్లో లక్షలు తగలేసుకొని, జీవితాల్ని నాశనం చేసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఎలిమెంట్ ను తన నెక్ట్స్ సినిమాలో చూపించడానికి రెడీ అవుతున్న తరుణ్ భాస్కర్, వెంకటేష్ ని అప్రోచ్ అయ్యి లైన్ చెప్పాడట. పాయింట్ కొత్తగా ఉండడంతో వెంకటేష్ కూడా తరుణ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. తెలంగాణ యాసలో వెంకీ చెప్పబోయే డైలాగ్స్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. వెంకటేష్ నటిస్తున్న వెంకీ మామ, తరుణ్ హీరోగా చేస్తున్న మీకు మాత్రమే చెప్తా సినిమాలు రిలీజ్ అయ్యాక, ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందని సమాచారం.