39.2 C
Hyderabad
April 25, 2024 15: 09 PM
Slider విశాఖపట్నం

సంక్రాంతి పప్పుల చిట్టీ పేరుతో మోసగించిన నిందితులు అరెస్టు

#police

‘ఎ.ఆర్.బెనిఫిట్ ఫుడ్ సంక్రాంతి కానుక’ (పప్పుల చిట్టీ) పేరుతో విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సుమారు 24 వేల మంది నుండి డబ్బులు వసూలు చేసి, మోసగించినట్లుగా ఇటీవల గుర్ల పోలీసు స్టేషనులో నమోదైన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి  కోటి 28 లక్షల 33,073/- ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఎ-1) కొండకరకాం కి చెందిన మజ్జి అప్పలరాజు, (ఎ-2) కొండగుంపాం కి చెందిన పతివాడ శ్రీలేఖ మరియు (ఎ-3) కొండకరకాం గ్రామానికి చెందిన మజ్జి రమేష్ ఒక బృందంగా ఏర్పడి, సంక్రాంతి పండుగకు 24 రకాల గ్రోసరీ సామాన్లు ఇచ్చేందుకుగాను నెలకు  300/- ల చొప్పున ఒక్కొక్కరి నుండి 3,600/-లను వసూలు చేసారన్నారు. ఇందుకుగాను వివిధ గ్రామాల్లో 189 మంది ఏజంట్లును నియమించుకొని, ఈ వసూళ్ళుకు పాల్పడ్డారన్నారు.

ఈ తరహా చిట్టీని 2021లో నిందితుడు ప్రారంభించి, చిట్టీని విజయవంతంగా నిర్వహించడంతో, ఎక్కువ మంది ఈ సంవత్సరం చిట్టీ కట్టేందుకు ఆసక్తి కనబర్చారన్నారు. విచారణలో సుమారు 24వేల మంది నుండి  8 కోట్ల 09,74,300/-ల మొత్తాన్ని నిందితులు చిట్టీ పేరుతో వసూలు చేసారన్నారు. ప్రధాన నిందితుడు విజయవాడలో వాటర్ ప్లాంట్ క్రొత్తగా పెట్టేందుకు 3.5 కోట్లను పెట్టుబడిగా పెట్టినట్లు, సకాలంలోప్లాంటు ప్రారంభం కాకపోవడంతో చిట్టీ కట్టిన వారికి గ్రోసరీ సామాన్లు అందించకపోవడంతో, పెద్ద సంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

అరెస్టుకాబడిన నిందితుల నుండి 15.18 లక్షల విలువైన 297.710 గ్రాముల బంగారు ఆభరణాలు, 44,12,900/- ల నగదు, 29,95,000/- ల విలువైన భూముల డాక్యుమెంట్లును స్వాధీనం చేసుకోవడంతో పాటు, 5 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 39,06,326/- ల నగదును ఫ్రీజ్ చేసామన్నారు. ఇవి కాకుండా వీరి పేరున 16 వాహనాలు, రెండు వాటర్ ప్లాంట్లు ఉన్నట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న భూముల మార్కెట్ విలువ ఎక్కువగానే ఉంటుందని, వీటిని కోర్టులో దాఖలు చేసి, విచారణ అనంతరం కోర్టు వారి అనుమతితో బాధితులకు అందజేస్తామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

కేసు దర్యాప్తుకు ప్రత్యేక అధికారులను నియమించిన రాష్ట్ర డిజిపిః ఈ పప్పుల చిట్టీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర డిజిపి గారు కేసు విచారణను మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ అర్జునరావు అనే అధికారులను ప్రత్యేకంగా నియమించారని, వారు త్వరలో ఈ కేసు దర్యాప్తును చేపట్టి, విచారణను మరింత లోతుగా దర్యాప్తు చేస్తారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. అధిక వడ్డీలకు ఆశపడి మోసపోవద్దని ప్రజలను కోరిన జిల్లా ఎస్పీ ఈ తరహా అనధికార చిట్టీలను ఎవ్వరూ నమ్మవద్దని జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రజలకు పిలుపు నిచ్చారు.

ఎక్కువ వడ్డీలు ఆశ చూపి, మోసాలకు పాల్పడే ఆర్ధిక సంస్ధల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా ఏజంట్లుగా నియమితుమయ్యే వారు తాము ఎటువంటి సంస్థకు పని చేస్తున్నామో, ఆ సంస్థ పూర్వాపరాలు పరిశీలించకుండా, వాటికి అనుమతులు ఉన్నాయో? లేవో? తెలుసుకోకుండా, వారు ఇచ్చే కమీషన్లుకు ఆశ పడి, ఇతరులను మభ్య పెట్టడం సరికాదన్నారు. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదైనందున బాధితులెవ్వరూ గ్రామాల్లోని ఏజంట్లుపై దాడులకు పాల్పడవద్దని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీః ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి, నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి ఆస్తులను రికవరీ చేయుటలో ప్రధాన భూమిక పోషించిన చీపురుపల్లి ఇన్ చార్జ్ డిఎస్పీ బి. మోహన రావు, గుర్ల ఎస్ఐ శిరీషలను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించారు.

Related posts

బదిలీ అయిన సీఐకి వీడ్కోలు: కొత్త సీఐకి స్వాగతం

Satyam NEWS

కారు… కమలం మధ్య నలుగుతున్న వడ్ల గింజ

Satyam NEWS

భత్యాల బర్త్ డే జరిపిన తెలుగుదేశం కార్యకర్తలు

Satyam NEWS

Leave a Comment