37.2 C
Hyderabad
April 18, 2024 20: 40 PM
Slider ఆంధ్రప్రదేశ్

వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

pjimage (12)

విజయనగరం జిల్లాలో అమ్మవారు వెలిసిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు కష్టాలే ఎరుగలేదన్న విశ్వాసం గట్టిగా ఉంది. ఏ ఊరిని  తుఫాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు జరిగినా విజయనగరం మాత్రం ప్రశాంతంగా ఉంటుందని ప్రతీతి. ఆ ప్రశాంతతకు కారణం పైడిమాంబయే.. ఆ చల్లనితల్లి ఈ నేలపై కొలువై ఉన్నందువల్లే ఈ ప్రాంతం ఎప్పుడూ సుభిక్షంగా  అలరారుతోందని భక్తుల నమ్మకం. ప్రజలకు అష్టఐశ్వర్యాలను కానుకగా ఇచ్చిన పైడితల్లి అంతకు మించిన పెద్ద కానుకగా ఈ నేలకు శాంతి సామరస్యాలను ప్రసాదించిందని విశ్వాసం. సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు.

కోటలో ఉన్న రౌండ్‌ మహల్‌ వద్దకు వెళ్లిన తర్వాత   అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా పాటలను ఆలపిస్తారు. అక్కడ పూజలు అనంతరం ఘటాలను చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు. అనంతరం పూజారి ద్వారా పైడిమాంబ రాబోవు ఏడాదికాలంలో జరిగే మంచి, చెడులను అమ్మపలుకుతుంది.  పంటల విషయంలోనూ, పాడిసంపదలోనూ ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుందో కళ్లకు కట్టినట్లు అమ్మ భవిష్యవాణి పలికిస్తుంది.

ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తుంది. ఆ భవిష్యత్‌వాణిని వినేందుకు రైతులు అక్కడకు చేరుకుంటారు. ఆ తర్వాత పూజారి ధాన్యపుగింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమపొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే ఆ ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయనేది రైతుల నమ్మకం. తొలేళ్ల ఉత్సవం సందర్భంగా వివిధ వేషధారణలతో పట్టణం కళకళలాడుతుంది. ఈ రాత్రంతా భక్తులు జాగారం మాదిరిగా పట్టణంలో కలియదిరుగుతారు.

పెద్దచెరువులో ఆత్మార్పణ చేసుకున్న పైడిమాంబను విగ్రహరూపంలో చెరువు నుంచి బయటకు తీసి గుడిలో  ప్రతిష్టించినది విజయదశమి తర్వాత  వచ్చిన మంగళవారం రోజున అట. అందుకని ప్రతిఏటా విజయదశమి వెళ్లిన తర్వాత  వచ్చే తొలి మంగళవారం రోజున అమ్మవారికి  సిరిమానోత్సవం నిర్వహిస్తారు. ఇలాంటి ఉత్సవం దేశంలో మరెక్కడా ఉండదు.  దాదాపు 50 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు.

సిరిమాను ఊరేగింపు సాగినంత మేరా భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మ దీవెనలు అందుకుంటారు. సిరిమాను బయలుదేరుతుందనగా సిరిమానుకు ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసిన వలకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు  పలువురు ఈటెలను ధరించి పాలధారగా అమ్మ ఆలయానికి చేరుకుంటారు.  అక్కడ నుంచి డప్పువాద్యాలతో మహారాజ కోట పశ్చిమభాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు.

వీరంతా సైనికులుగా ఆ సమయంలో పనిచేస్తారు. సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్థానం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు ఆరుమూరల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి సంబరంలో పాల్గొంటారు. స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులకు ప్రతీకలుగా వ్యవహరిస్తారు. వీరంతా అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంత సేపూ భక్తులపై విసురుతూ ఉంటారు. దానికి ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటిపళ్లను వారిపై విసురుతూ ఉంటారు.

సోమవారం తొలేళ్ల ఉత్సవం జరిగింది. 15, మంగళవారం సిరిమానోత్సవం,  22, మంగళవారం వనంగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మేళతాళాలతో, బాజాభజంత్రీలతో పెద్దచెరువులో అమ్మవారి  ఉత్సవవిగ్రహంతో తెప్పోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. 26, శనివారం వనంగుడి వద్ద నుంచి సాయంత్రం 5.30 గంటలకు దీక్షాపరులు జయ జయ ధ్వానాల మధ్య కలశ జ్యోతులు పట్టుకుని ఉత్సవ విగ్రహంతో రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న వనంగుడి నుంచి బయలుదేరి చదురు గుడికి చేరుకుంటారు.

అక్కడ అమ్మవారికి జ్యోతులు సమర్పించి, ఆలయం ఆవరణలో జరిగే అంబలం పూజలో పాల్గొంటారు. 29, మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహిస్తారు. మరుసటిరోజు అక్టోబరు 30న వనంగుడి ఆవరణలో పూర్ణాహుతి, దీక్షావిరమణలతో పైడితల్లి జాతరమహోత్సవాలు ముగుస్తాయి.

Related posts

కేసీఆర్ నామస్మరణ జపం కోసమే ఆరాటం

Satyam NEWS

మిల్లుల్లో కటింగ్ లేకుండా ధాన్యం సేకరణ

Satyam NEWS

రామప్ప ఆలయ పూజారులకు, గైడ్ లకు సన్మానం

Satyam NEWS

Leave a Comment