రాజకీయాల్లో మాజీ ఎంపి విజయసాయిరెడ్డి ఒక మాయల ఫకీరు అని, ఆయన ఏదైనా చేయగలడు, ఎవరినైనా నమ్మించగలడని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శనివారం విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా ఆమోదం నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం కలగటానికి సాయి రెడ్డి బుద్దుడు కాదని చెప్పారు. ఆయనకు వ్యవసాయం అసలు తెలియదని, నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి విధేయత కలిగిన ఆడిటర్ అని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనూ నెంబర్ టుగా ఉన్న నాయకుడు వ్యవసాయం చేసుకుంటాను అంటే దొంగ కొంగ జపం వంటిది అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనంతటి వాడు లేడని విర్రవీగి, అధికారం పోగానే పలాయనం చిత్తగించటం విజయసాయి నైజం అన్నారు. ఆయన కేసులకు భయపడే వ్యక్తి కాదని, భయపెడితే భయంతో వణికి పోయే మనిషి కూడా కాదన్నారు. భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగానే వైకాపాకు రాజీనామా చేశారని, వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్ళిన చందంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజీనామా వెనుక కొత్త రాజకీయం ఉండి ఉండవచ్చు అని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.