కోర్టు అనుమతిస్తే విదేశాలకు జంప్ అయ్యేందుకు జగన్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ముంచుకొస్తున్న కేసుల భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాకినాడ పోర్టు లావాదేవీల విషయంలో ఇటీవల ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది.
అరబిందో శరత్ రెడ్డిని ముందు పెట్టి ఆయన అనేక ఆర్థిక పరమైన అవకతవకలు చేశారని, వాటిపై విచారణలు జరుగుతున్నాయని చెబుతున్నారు. తాజాగా విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో విజయసాయి రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది. కోర్టు కనుక అనుమతిస్తే విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని వైసీపీ నేతలే చెబుతున్నారు.