మాజీ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నిన్నమొన్నటి వరకు వైసీపీలో కీలక బాధ్యతలు నిర్వహించిన వేణుబాకం విజయసాయిరెడ్డికి కాకినాడ పోర్టు ఉచ్చు బిగుసుకున్నట్లే కనిపిస్తున్నది. కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణ సమయంలో లోపలకు లాయర్లను కూడా అధికారులు అనుమతించలేదు.
విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి చేరుకున్న విజయసాయిరెడ్డిని కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసు లో పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగారు. ఈ కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి ఆయన చేరుకున్న సమయంలో కొద్ది పాటి ఉద్రిక్తత నెలకొన్నది. విజయసాయి మినహా మరెవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు.
ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను కూడా ఆపేశారు. వాటాల బదిలీ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై విజయసాయిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కాకినాడ పోర్టు అధిపతి కేవీ రావును బెదరించి అక్రమంగా వాటాలను తీసుకున్నారనే అభియోగాలతో ఈ కేసు నమోదయింది. ఈ కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. ఇదే కేసులో విజయసాయిని ఇప్పటికే ఈడీ విచారించింది. తాజాగా ఈరోజు ఆయనను సీఐడీ విచారించింది. ఇటీవలే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా చేశారు.