37.2 C
Hyderabad
April 18, 2024 19: 08 PM
Slider కృష్ణ

ఎర్రవాడ జనసంద్రం: కదం తొక్కిన కామ్రేడ్లు

#cpinarayana

అరుణపతాక రెపరెపలతో విజయవాడ నగరం పులకించిపోయింది. విప్లవాల పురిటిగడ్డ మరోమారు  ఎరుపెక్కింది. వేలాదిమంది రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు కదం తొక్కుతూ ముందుకు సాగారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మొక్కవోని పట్టుదలతో ముందుకు నడిచారు.  సీపీఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనను నగర ప్రజానీకం ఆసక్తితో తిలకించింది. తప్పట్లు, తాళాలు, డప్పు వాయిద్యాలు, విప్లవగేయాలతో ప్రదర్శన ఎంతో కోలాహలంగా ముందుకు సాగింది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీపీఐ, అనుబంధ ప్రజా సంఘాల కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా ప్రదర్శనలో పాల్గొన్నారు. సీపీఐ జిందాబాద్‌, విప్లవం వర్థిల్లాలి, ఎరుపులోన మెరుపుంది, పోరాడే శక్తి ఉందంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టుతూ ప్లకార్డులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. తమ తమ జిల్లాల బ్యానర్లను చేబూని ఉక్కు క్రమ శిక్షణతో వరుస క్రమంలో ముందుకు సాగారు.

యువకులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చివరకు చిన్నపిల్లలు సైతం పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వందలాది మహిళలు ఎర్ర అంచు తెల్లచీరలు, యువ మహిళలు ఎర్ర శల్వార్‌, తెల్ల పైజామా ధరించారు. వేలాది మంది ఎర్రచొక్కాలు ధరించి పాల్గొనడంతో కనుచూపుమేర ఎరుపుమయమైంది. కిలోమీటర్ల పొడవునా ప్రదర్శన సాగింది.  బీఆర్‌టీఎస్‌ రోడ్డు చివర పండ్ల మార్కెట్‌ దగ్గర నుంచి  ప్రారంభమైన ఈ ప్రదర్శన సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, గవర్నమెంటు ప్రెస్‌ సెంటర్‌, సింగ్‌ నగర్‌ ప్లైఓవర్జ్‌ మీదుగా  డాబా కొట్ల సెంటర్‌  గుండా అమరజీవి చండ్ర రాజేశ్వరరావు మైదానం (మాకినేని బసవపున్నయ్య స్టేడియం)కు చేరుకుంది. 

కేరళ, తమిళనాడు, విశాఖపట్నం, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, తిరుపతి నుండి ప్రత్యేక రైళ్ల ద్వారా సీపీఐ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్ళు, బస్సులు, లారీలు, కార్లు, తదితర వందలాది వాహనాల్లో కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీంతో తెల్లవారురaాము నుంచే విజయవాడ నగర వీధులు కిక్కిరిసిపోయాయి.  నగరంలో ఏ వీధి చూసినా కామ్రేడ్ల సందడే కనిపించింది.

సద్ది అన్నం, పులిహోర, చపాతీలు వంటి స్వగృహ వంటలను మూటగట్టుకుని అనేకమంది మహిళలు ఉదయాన్నే నగరానికి చేరుకోవడం పార్టీ పట్ల వారి నిబద్ధతకు నిదర్శనంగా కనిపించింది. అలాగే కొంతమంది మహిళలు పసిబిడ్డలను చంకనెత్తుకొని, నెత్తిన సద్ది మూట పెట్టుకుని విప్లవ నినాదాలతో ప్రదర్శనలో హుషారుగా పాల్గొనడం యువతకు స్ఫూర్తినిచ్చింది.సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు రోడ్ల పక్కన కూర్చుని భోజనాలు చేసి పార్టీ పట్ల తమకున్న అంకితభావాన్ని చాటారు.

ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుండి గిరిజనులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  ప్రదర్శన అగ్రభాగాన వేలాదిమంది యువ రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు, యువ మహిళలు అరుణ పతాకాలతో ముందుకు సాగగా,  ఆ తర్వాత వేలల్లో  జనసేవాదళ్‌ కార్యకర్తలు కదంతొక్కారు.  వారి వెనుక వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, కార్యకర్తలు వరుస క్రమంలో ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళలు దాదాపు 120 అడుగుల అతిపెద్ద బ్యానర్‌ను పట్టుకుని  ప్రదర్శన అగ్రభాగాన పాల్గొనడం చూపరులను ఆకర్షించింది. 

ప్రదర్శన అగ్రభాగాన సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, జాతీయ నాయకులు డాక్టర్‌ కె.నారాయణ, అతుల్‌ కుమార్‌ అంజన్‌, పల్లవ్‌సేన్‌ గుప్త్తా, అనీ రాజా,  బినయ్‌ విశ్వం, అమర్‌జిత్‌ కౌర్‌, బాలచందర్‌ కాంగో, సంతోష్‌ కుమార్‌, చాడా వెంకట రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ పార్టీ సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు,  జేవిఎస్‌ఎన్‌ మూర్తి, రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ తదితరులు నడవగా…నగర ప్రజానీకం రోడ్డుకిరువైపులా పెద్దసంఖ్యలో నిలబడి దారి పొడవునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. సింగ్‌ నగర్‌ రింగు వద్ద సీపీఎం నాయకులు సౌహార్థ్ర స్వాగతం పలికి సంఫీుభావం తెలిపారు.

సీపీఐ జాతీయ 24వ మహాసభలలో భాగంగా శుక్రవారం విజయవాడ నగరంలో నిర్వహించిన ప్రదర్శనలో బోనాలతో పాల్గొన్న మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బోనాలు తలపై పెట్టుకుని మహిళలు ప్రదర్శన ఆధ్యాతం ఆగ్రశ్రేణి నాయకత్వాన్ని అనుసరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. అంగవైకల్యాన్ని సైతం పక్కనపెట్టి తిరుపతి నుంచి తరలివచ్చిన అనిత అనే ఒక యువతి వీల్‌చైర్‌లో ప్రదర్శనలో పాల్గొని తోటికి వారికి స్ఫూర్తిగా నిలిచింది.

ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న మతోన్మాద భూతం వేషధారణ ప్రజలను ఆలోచింపచేసింది. చిన్నారులు సైతం ప్రదర్శనలో పాల్గొని నినాదాలు ఇస్తూ మార్చ్‌ చేయడం చూపరులను కట్టిపడేసింది. వివిధ రంగుల వస్త్రధారణలో మహిళలు ముందుకు సాగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కామ్రేడ్‌ వారి వారి భాషలలో నినాదాలు ఇస్తూ ప్రదర్శనలో ముందుకు సాగడం ఆకట్టుకుంది. ప్రదర్శన సాగుతున్న రహదారికి ఇరువైపుల ప్రజలు బారులు తీరి ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

Related posts

ఎస్ 5 నో ఎగ్జిట్ థియేట్రికల్ హక్కులకు భారీ అమౌంట్

Bhavani

రెడ్ లైట్: ఒకే బాలిక రెండు సార్లు కిడ్నాప్

Satyam NEWS

ఒవైసీ ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలి

Satyam NEWS

Leave a Comment