28.7 C
Hyderabad
April 20, 2024 06: 14 AM
ఆధ్యాత్మికం

సర్వ వ్యాపి భగవంతుడిని దర్శించేది ఎలా?

#UniversalGod

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

దేవుడు అనగానే ఏదైనా గుణం కాని వస్తువుకాని స్ఫురిస్తుందా ? ఆయనను తెలుసుకోటానికి లేదా ప్రత్యక్షం చేసుకోటానికి ఏదైనా ఉపాయం ఉన్నదా ? అందరూ అంగీకరించిన విషయం ఏమిటంటే – దేవుడు అనే  శబ్దంలో ఏదో ఒక గొప్ప శక్తి ఉన్నది అని. దేవుడు సర్వవ్యాపి, దేవుడు విశ్వవ్యాపి అని అన్నప్పుడు, దేవునిలో స్థాన వ్యాపకతా గుణము ఉన్నదని స్పష్టమవుతుంది.

అందులో ఎవరికీ ఎలాంటి సందేహములేదు. ఒక పుస్తకము కొంత స్థానం ఆక్రమించి ఉన్నది అంటే దానికి ఆకారము ఉన్నట్లే కదా ! కాని దేవుడు ఒక స్థానంలో ఉన్నాడు అన్నప్పటికీ ఆయనను నిరాకారుడని ఎందుకు చెబుతారు ? కొంత స్థలాన్ని ఆక్రమించిన వస్తువు సాకారమైనదిగా చెప్పబడుతుంది. కాని విశ్వవ్యాపియైన దేవుడు మాత్రం అట్లా హద్దులున్న స్థలంలో లేడు. ఈ విశ్వం అనంతమైనది, హద్దులు లేనిది. అట్లాగే అందులో ఉన్న దేవుడు కూడా హద్దులు కాని, అంతము కాని లేనివాడు. అందువలననే ఆయన నిరాకారుడు.

దేవుడికి హద్దులు లేవు

ఎవరైనా కల్పనా లక్షణం వలన విశ్వానికి హద్దులు ఉన్నాయని అనవచ్చును. అప్పుడు ఆ హద్దులకు అవతల కూడా ఆయనకు స్థానమున్నదో లేదో ఆలోచించాలి. ఆ విధంగా ఎవ్వరూ ఆలోచించలేదు. బుద్దితో తెలుసుకోలేరు. అందువలన విశ్వానికి హద్దులు లేవు. అప్పుడు దేవునికి కూడా హద్దులు లేవు.

విశ్వంలో ఎన్ని చోట్లు ఉన్నాయో, ఆ అన్నింటిలోను ఆయన వ్యాపించియున్నాడు. అందువలన ఆయన నిరాకారుడు. అంతేకాదు, భగవంతుని ఆకారాన్ని తులతూచగల శక్తి కూడా మనుష్యుని జ్ఞానంలో కాని బుద్ధిలోకాని ఏదీ లేదు. అందువలన అతని ఆకారాన్ని అంచనా వేయ్యలేము. కనుక ఆయన నిరాకారుడు.

దేవుడు నిర్గుణడు ఎట్లా ?  

దేవుడు నిర్గుణడు ఎట్లా ? అన్ని గుణాలు ఉన్నవాడు, బుద్దికి అగోచరుడైనవాడు అయిన ఆయనను నిర్గుణుడని ఎట్లా చెబుతాము ? దేవుని గుణాలకు హద్దులులేవు. అట్లాగే ఆయనకు ఎన్నిరకాల గుణాలు ఉన్నాయో వాటికి కూడా హద్దులేదు. ఆయన గుణములు తులలేనివి. అందువలన ఆయన నిర్గుణుడు.

ఎవరి పరిమాణాన్ని లెక్కించలేమో ఆయన సీమారహితుడు. ఆయన గుణాలను కూడా లెక్కించలేము కనుక ఆయన నిర్గుణుడు. ఈ జగత్తులోని గుణములన్నీ దేవుని ఒక్క గుణం నుంచి పుట్టినవే ! అదే గుణము ఆయనలో ఉన్నదని, దానికి విపరీతమైన గుణములేదని ఎవరూ చెప్పలేదు.

ఈ జగత్తులో ఎన్ని రకాల గుణాలు ఉన్నాయో అవన్నీ ఆయనలోని అనిర్వచనీయ గుణంలో అంతర్గతంగా ఉన్నాయి. అందువలన ఆయన గుణాలలకు హద్దులేదు. మన ఇంద్రియాలకు ఆయన అంతుపట్టడు. అందువలన ఆయన నిర్గుణుడు. దేవుని రూపం ఎట్లా ఉన్నది ?

అన్ని రూపాలూ దేవుని రూపం నుంచి వచ్చినవే

ఈ జగత్తులో ఎన్ని రకాల రూపాలు ఉన్నాయో అవన్నీ దేవుని రూపం నుంచే వెలువడినాయి. అయినా అవి భిన్నభిన్నమైన పేర్లతో ప్రకాశిస్తున్నాయి. అయినా ఆ భగవంతుని రూపంతో పోల్చి చెప్పగల రూపం ఒక్కటీ ఈ జగత్తులో లేదు. ఆయన జ్యోతిర్మయుడు. అనంద స్వరూపుడు.

కనుక ఆయనను విశ్వరూపుడంటారు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, అట్లాగే దేవుళ్ళు, దేవతలు అందరూ ఆయన స్థూలరూపాలే ! ముముక్షువైనవాడు భగవంతుని స్థూల రూపాన్ని ఆశ్రయించాలి. లేకపోతే ఆయన సూక్ష్మరూపం గోచరింపదు. క్రమక్రమంగా ఆ భగవంతుని అవినాశకమైన పరమ రూపమును ధారణ చేస్తూ ఉంటే, ఆయన విశ్వరూపం అతనికి అనుభవంలోకి వస్తుంది.

ఆయన రూపమాధుర్యాన్ని చూడని వారిని గురించి ఏమని చెప్పాలి ? ఆయనను దర్శించని వారు ఆయనను గురించి వర్ణించటంలో అసమర్థులు. ఎందుకంటే, ఆయనను వర్ణించి చెప్పగల యోగ్యత ఏ భాషకూ లేదు. అంతేకాక ఆయన రూపాన్ని చూడగానే లోకులు మోహితులై అవాక్కులవుతారు. లేదా జ్ఞాన శూన్యులవుతారు.

దేవుడు చేతనుడా ? అచేతనుడా ?

అంటే దేవుడు చేతనుడు కాడు. అచేతనుడుకాడు. ఆయనలోని అనవచ్ఛిన్న నిర్గుణ శక్తినే చైతన్య గుణమంటారు. చైతన్య గుణమంటే ఏమిటో అది అందరికీ తెలిసినదే. కాని, అనవచ్ఛిన్న చైతన్య గుణము ఎట్లా ఉంటుందో తెలుసుకోటానికి మనకు శక్తి లేదు. దేవుడు విశ్వరూపుడు, నిరాకారుడు, నిర్గుణుడు.

అందువలన ఆయన ఆకారము, రూపము, గుణములను తెలుసుకోవటం మన శక్తికి మించిన విషయము. ఈశ్వరుని గుణములను కూడా మనం ఆలోచించలేము. ఎందుకంటే అది మనస్సుకు ఆగోచరమైనది. అందువలన ఆయనను ఉపాసించటం కూడా కష్టమైనపని.

సగుణ రూపాన్ని ధ్యానిస్తే నిర్మలత్వం

ఒకవేళ ఎవరైనా దేవుని నిరాకార రూపమును చూడగలుగుతున్నామని చెబితే, వారికి నిరాకారమనే శబ్దానికి అర్ధం కూడా తెలియదని స్పష్టమవుతుంది. అందువలన మనం దేవుని సగుణ రూపాన్ని ధ్యానించి, చింతన చెయ్యాలి. భగవంతుని సగుణ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే, మనస్సు ఎంత నిర్మలంగా అవుతూ ఉంటుందో, అంతగా ఆత్మ ప్రకాశము అంతరంగంలో అవుతూ ఉంటుంది.

అప్పుడు మనస్సు యొక్క సహాయం లేకుండానే ఈశ్వరాకార అస్తిత్వ అనుభవాన్ని పొందగలుగుతాము. సగుణ భగవంతుడని ఎవరిని అంటారు అని ఎవరైనా జిజ్ఞాసువులు అడగవచ్చును. ఎవరైతే అత్యన్నత స్థితిని పొందినారో, వారే దేవునిలో లీనమైపోతారు.

అప్పుడు ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి ఉన్నత శీలంగలవారు సమస్త బ్రహ్మాండన్నీ తమలోనే చూడగలుగుతారు. ఆ ఉన్నత పురుషులే మనుష్య దశలో చరమస్థాయిని పొందినవారవుతారు. వారే సగుణ ఈశ్వరులు. ఏ మనిషి రూపంలో సమస్త విశ్వమూ ప్రతిబింబించి ఉంటుందో ఆయను సగుణ ఈశ్వరుడు.

ఈశ్వర తత్త్వాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస

ఎవరైతే కర్మ చేస్తూ కూడా నిష్ర్కియుడో, ఎవరు మనుష్యరూపంలో ఉన్న అంతరంగంలో విశ్వరూపుడో, ఎవరి తత్త్వజ్ఞానం వలన బ్రహ్మాండోత్పత్తి అయిందో, ఎవరికి మేమే బ్రహ్మపదార్ధమనే జ్ఞానం ఉంటుందో, ఆ ఆత్మజ్ఞానులే భగవత్ స్వరూపులై దేవుడనిపించుకొంటారు.

ఈశ్వర తత్త్వాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎవరి మనస్సులోనైనా కలిగితే, అలాంటి ఉన్నత పురుషులతో సంబంధం పెట్టుకొని అవిరామంగా చింతన చెయ్యాలి. మన ఆత్మ జిజ్ఞాసను అలాంటి ముక్తాత్ముల గుణములతో కలిపే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఏదో ఒక అజ్ఞాత శక్తి మీకు మార్గదర్శనం చేయిస్తూ, మిమ్మల్ని తనవెంట నడిపిస్తున్నట్లు మీకు క్రమంగా అనుభంలోకి వస్తుంది.

సగుణుడు, నిర్గుణుడు, నిరాకారుడు

విశ్వవ్యాపి సచ్చిదానంద స్వరూపుడు ఒక్క భగవంతుడే అనే విషయం స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఎవరు – నాలుగు దిక్కులా లోపల బయట నిరవచ్ఛిన్నంగా నిలిచి ఉన్నారో, ఎవరి సంజ్ఞా మాత్రము చేతనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వాయువు, వరుణుడు మొదలైన వారంతా

తమతమ కర్తవ్య పాలనలను చేస్తారో, ఎవరి శక్తివలననే మనము జీవించి ఉన్నామో, కాళ్ళు లేకపోయినా ఎవరు అంతటా సంచరించ గలుగుతారో, కళ్ళు లేకపోయినప్పటికీ ఎవరు అన్నీ చూడగలుగుతారో, మనము చూస్తూ ఉన్నప్పటికీ ఎవరిని మనము  చూడలేమో, కామ-క్రోధ-లోభ-దురాశా- విషయవాసనలు ఎవరిని చూసి దేహం  విడిచిపారిపోతాయో,

జ్ఞానము కూడా ఎవరి స్వరూప వర్ణనను చేయటంలో అసమర్తమైనదో,కల్పనా శక్తి కూడా ఎవరిని కొలవటం కాని తూచటంకాని చేయ్యలేదో, మనస్సుకాని ఆత్మకాని ఎవరి దగ్గరకు పోయినా మళ్ళీ తిరిగి వస్తుందో, మాయ ఎవరిని ఆవరించలేదో, వాక్యములు ఎవరిని వ్యాఖ్యానించలేవో – ఆయనే దేవుడు.

వైరాగ్యం, జ్ఞానం యోగము ధర్మము

ఎవరికి హారతి పట్టడానికి సూర్యచంద్రులు  దీపాలను వెలిగిస్తున్నారో, గాలి చామరములను వీస్తూ ఉంటుందో, తరులతలు పుష్పరాశి ద్వారా సుగంధదానం చేస్తూ ఉంటాయో, పక్షి గుణములు సంకీర్తన చేస్తూ ఉంటాయో, వజ్రం లాంటి శంఖము ధ్వని చేస్తూ ఉంటుందో, భక్తి-శ్రద్ద-శాంతి- కరుణ-ముక్తులు ఎవరి పాదసేవ చేస్తాయో, వైరాగ్యం, జ్ఞానం యోగము ధర్మము ఎవరి ద్వారం వద్ద కాపలాకాస్తూ ఉంటాయో,

ఎవరు జీవుని కర్మానుసారం ఫలాన్ని ఇస్తూ  ఉంటారో, ఎవరు తనను మరచిపోయినవారిని కూడా వదల పెట్టడో, మాయనిద్రను వదలి జాగ్రదవస్థకు ఎవరు అందరినీ ఆహ్వనిస్తూ ఉంటారో, తాను నిర్గుణుడై ఉండికూడా త్రిగుణములతో త్రిజగత్తులను ఎవరు బంధించి ఉంచుతాడో,

తాను రూపహితుడై ఉండికూడా ఆశ్చర్యకరమైన రూపములో త్రిభువనములను ఎవరు మోహింపజూస్తూ ఉంటాడో, తాను స్వయముగా చైతన్యస్వరూపుడై ఉండికూడా మామమోహములతో జీవులను అచేతనులుగా చేశాడో ఆయనే దేవుడు. బ్రహ్మ జగత్తును ఆవరించియున్నాడు.

కానీ బ్రహ్మను ఏ వస్తువూ ఆవరించిలేదు. అయినా బ్రహ్మచే ఆవరించబడిన దృశ్య పదార్ధాలన్నీ కేవలం ఎడారిలోని ఎండమావులలాగా మిథ్యాజ్ఞాన మాత్రములే. చూడబడేది. వినబడేది అయిన ప్రతి వస్తువూ బ్రహ్మ కన్న అభిన్నములు. కారణమేమిటంటే జ్ఞానోదయం కాగానే అదే వస్తువు అద్వితీయము, సచ్చిదానందము అయిన బ్రహ్మతప్ప మరేమీ కాదని స్పష్టమవుతుంది.

జ్ఞానచక్షువు లేకుండా మనిషి దర్శించలేడు

జ్ఞానియైనవాడు జ్ఞానచక్షువుతో సర్వవ్యాపి – నిత్యము – జ్ఞాన స్వరూపము అయిన ఆత్మను దర్శిస్తూ ఉంటాడు. గ్రుడ్డివాడు సూర్యుని చూడలేనట్లు, జ్ఞానచక్షువు లేకుండా మనిషి దానిని దర్శించలేడు. సూక్ష్మము కానివాడు, స్థూలముకానివాడు, హ్రస్వముకానివాడు, దీర్ఘముకానివాడు, జన్మవినాశ రహితుడు,

రూప-గుణ-వర్ణ-నామరహితుడు, నిత్యమూ ఒకే రూపంలో దగ్గరలోను- పైన – క్రింద- అన్ని దిక్కులలో ఉండేవాడు, పూర్ణము – సత్యము – చైతన్యము – ఆది – అంతములు లేనివాడు,

అద్వితీయ ఆనందమయుడు ఎవరో ఆయనే దేవుడు. ఏ లాభాన్ని మించిన లాభంలేదో, ఏ సుఖాన్ని మించిన సుఖంలేదో, ఏ జ్ఞానాన్ని మించిన జ్ఞానం లేదో, ఎవరిని చూసిన తరువాత చూడవలసిన దృశ్యమేదీ ఉండదో, ఎక్కడికి చేరుకొన్నాక మళ్ళీ జన్మ ఉండదో, ఎవరిని తెలుసుకొన్న తరువాత ఇంకా తెలుసుకోవలసినవి ఏమీ ఉండవో – ఆ బ్రహ్మపదార్థమే దేవుడు.

Related posts

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో చండీహోమం

Satyam NEWS

శ్రీశైలం దేవస్థానానికి మహాశివరాత్రి ఆదాయం రూ. 4 కోట్లు

Satyam NEWS

తిరుమల శ్రీవారికి రికార్డ్ స్థాయిలో ఆదాయం

Bhavani

Leave a Comment