కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైన వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభినందించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక అనంతరం కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ విధులను సమర్ధవంతంగా నిర్వహించి పదవులకు వన్నె తేవాలని వినోద్ కుమార్ మేయర్, డిప్యూటీ మేయర్ లకు సూచించారు.
కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధి కోసం పాటు పడాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలవాలని, అభివృద్ధికి కంకణ బద్ధులు కావాలని వినోద్ కుమార్ సూచించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలని, శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) ద్వారా నగర అభివృద్ధి కి కృషి చేయాలని, మాస్టర్ ప్లాన్, మానేరు రివర్ ఫ్రంట్ వంటి అంశాలపై దృష్టి సారించాలని వినోద్ కుమార్ సూచించారు.