విశాఖపట్నం జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సత్వర చర్యలను తీసుకుంటున్నది. అల్లిపురం నుండి కరోనా వైరస్ పాజిటివ్ గల వ్యక్తి 19వ తేది సాయంత్రం ఛాతీ హాస్పిటల్ కు చేరుకున్నారు.
దాంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై తేదీ 20 ఉదయం నుండి అల్లిపురం లో వారి ఇంటి వద్ద క్లస్టర్ కంటైన్ మెంట్ జోన్ లో డిస్ ఇన్ఫెక్ట్ చేయడానికి అల్లిపురం పరిసర ప్రాంతాలు సర్వే చేయడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ పూర్తి వివరాలను మీడియాకు అందచేశారు. ఈ నెల 20 వ తేదీన 28, 30 వార్డుల్లో వైద్య ఆరోగ్య శాఖ 141 బృందాల తో సర్వే చేశారని, 7050 గృహాలకు 20వ తేదీన 6800 గృహాలు సర్వే చేసినట్లు తెలిపారు. ఈ సర్వే లో 141 టీంలు, 8 పాసివ్ స్క్రీనింగ్ టీంలు పాల్గొన్నట్లు చెప్పారు.
21వ తేదీన 27, 29 వార్డుల్లో సర్వే ప్రారంభించగా మధ్యాహ్నం 1 వరకు 163 టీంలు సర్వేలో పాల్గొనగా మధ్యాహ్నం నుండి 172 టీంలు పాల్గొన్నట్లు వివరించారు. 21వ తేదీన 8 పాసివ్ స్క్రీనింగ్ టీంలు పాల్గొన్నాయన్నారు. అల్లిపురం ప్రాంతంలో 3 కిలో మీటర్ల రేడియస్ లో ఉన్న గృహాలన్నింటినీ సర్వే చేసినట్లు ఆయన వివరించారు. జ్వరం, జలుబు, దగ్గు లతో ఎవరైనా ఉంటే అలాంటి వారిని గుర్తించడం కోసం సర్వే జరిగింది. మొత్తం 25 వేల 950 గృహాలను సర్వే చేసినట్లు తెలిపారు. సర్వే ఇంకా జరుగుతుందని చెప్పారు.