40.2 C
Hyderabad
April 19, 2024 18: 55 PM
Slider సంపాదకీయం

ఇంకా నాశనం చేయడానికి ఏపీలో ఏముంది?

#VizagSteels

విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా అన్యాయం చేసేందుకే బిజెపి కృతనిశ్చయంతో ఉంది. అందులో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం నుంచి ఇప్పటి విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయడం వరకూ బిజెపి చేసిన నష్టం అంతా ఇంతా కాదు.

బిజెపి ఇదంతా కావాలని చేస్తున్నదా? లేక అలా జరిగిపోతున్నదా? అనే చర్చ అనవసరం. అన్యాయం మాత్రం చేస్తూనే ఉన్నది. బిజెపి ఇంత బరితెగించి ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయడానికి కారణం ఆ రాష్ట్రంలో ఉన్న దరిద్రపు రాజకీయాలే. కులాల వారీగా విడిపోయి కొట్టుకు చస్తున్న రాజకీయ నాయకులు సమష్టిగా పోరాటం చేసేందుకు ముందుకు రారు. రాలేరు.

ఈ విషయం పూర్తిగా ఆకళింపు చేసుకున్న బిజెపి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఫుట్ బాల్ లాగా ఆడుకుంటున్నారు. సమైక్య రాష్ట్రాన్ని విభజించే సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని అసహ్యించుకున్నారు. ఆ పార్టీకి నామరూపాలు లేకుండా చేశారు.

తొలి నుంచి బిజెపికి ఆంధ్రప్రదేశ్ లో (రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడుగానీ, విడిపోయిన తర్వాతగానీ) ఎప్పుడూ గుప్పెడు ఓట్లు కూడా లేవు. అలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేయడానికి ఏ మాత్రం సందేహించడం లేదు.

సిద్ధాంతాలు అవీ ఇవీ అంటూ కబుర్లు చెప్పే బిజెపి నాయకులు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే సాహసం చేయడం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ కు మోడీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులు, విడుదల చేసిన నిధులు ఏకరువు పెట్టి ప్రత్యర్థుల నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై నాలుక మడత పెట్టిన బిజెపి, పోలవరంపై కప్పదాటు వేసింది.

అమరావతి పై మాటతప్పి మడం తిప్పిన నాటి నుంచి ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రయివేటు వారికి తాకట్టు పెట్టడం వరకూ బిజెపి బరితెగించి వ్యవహరిస్తున్నదని చెప్పకతప్పదు. ఓట్లే లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో యథేచ్ఛగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‍పై ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మల సీతారామన్ సమాధానం ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ మంటల్లోకి నెట్టింది.

విశాఖ స్టీల్ ప్లాంట్‍లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవు, స్టీల్ ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో అవసరమైతే సంప్రదింపులు జరుపుతాం- అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరతాం అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

స్టీల్‍ప్లాంట్‍లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా ఆమె చెప్పారు. ఇప్పటికే నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ విషయంలో విశాఖ ఉక్కు పోయినంత మాత్రాన కొత్తగా జరిగే నష్టం ఏమీ లేదు. ప్రత్యేక హోదా రాలేదు.

అమరావతి పోయింది. పోలవరం ఆగింది. ఇప్పుడు విశాఖ ఉక్కు చరిత్రలో కలిసి పోతున్నది. మనం మాత్రం పోరాటం చేయలేం. చేయం కూడా. ఎందుకంటే మనకు కులం ఒక్కటే ముఖ్యం. కమ్మ దిగిపోతే రెడ్డి వస్తాడు… రెడ్డి దిగిపోతే కమ్మ వస్తాడు… మధ్యలో అధికారం వస్తుందేమో ఛాన్సు చూసుకుందాం అని బిజెపి కాపు నాయకులను ప్రోత్సహిస్తుంది.

రెడ్డి కమ్మ కాపు మధ్య రాష్ట్రం నాశనం అయితే మనకేంటి? ఓ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ… మమ్మల్ని క్షమించు. నీకన్నా మాకు కులమే ఎక్కువ. కులం కోసం మేం ఎంత దూరమైనా వెళతాం. దేన్నైనా అమ్ముకుతింటాం. ఓ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ… మమ్మల్ని క్షమించు.

Related posts

మాన‌వ‌సేవ నే మాధ‌వ సేవ: దాస‌న్న‌పేట‌లో చ‌లి వేంద్రం ప్రారంభం

Satyam NEWS

ఖాకీల అత్యుత్సాహంతో బలవంతపు అరెస్టులు

Satyam NEWS

భద్రాచల రాముడికి ఎదుర్కోలు ఉత్సవం

Satyam NEWS

Leave a Comment