ఆంధ్రుల హక్కు… విశాఖ ఉక్కు అంటూ ఇప్పుడు విశాఖ వీధుల్లో నిత్యం వినిపిస్తున్న నినాదాలు. అయితే మరికొద్ది రోజుల్లో నగర వీధుల్లో ఈ నినాదాలు వినిపించవనే చెప్పాలి. ఎందుకంటే… కార్మికులు భయపడుతున్నట్లుగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే పనికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు దాదాపుగా స్వస్తి చెప్పేసిందనే చెప్పాలి. అదే సమయంలో విశాఖ ఉక్కుకు పునరుజ్జీవ ప్యాకేజీ (రివైవల్ ప్యాకేజీ)ని ప్రకటించే దిశగా కేంద్రం సాగుతోంది. ఏపీలోని కూటమి సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ… దీనిపై తనదైన వ్యూహాలను అమలు చేసి విశాఖ ఉక్కుపై కేంద్రం వైఖరిని పూర్తిగా మార్చివేసిందని చెప్పక తప్పదు.
తాజా సమాచారం ప్రకారం… రివైవల్ ప్యాకేజీ కింద విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.17 వేల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్యాకేజీ మొత్తం నిధుల రూపంలో కాకుండా… ఆ మేర విలువైన టెక్నాలజీని అందించనుందట. ఏదైతేనేం,.,.. విశాఖ ఉక్కుకు సరికొత్త ఊపిరి వస్తుందటంటే… అదే చాలు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే… కేంద్రం పెట్టిన ఈ నూతన ప్రతిపాదనపైనా కార్మిక సంఘాలు భగ్గుమంటున్నట్లు సమాచారం. వైసీపీ జమానాలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడ్డాయి. నాడు జపాన్ కు చెందిన పోస్కో సంస్థ విశాఖకు సాంకేతికగా సహకరిస్తామని చెప్పింది.
కార్మిక సంఘాల నిరసనతో వెనక్కి తగ్గిన కేంద్రం
అందుకు గాను… విశాఖ స్టీల్ ప్లాంట్ లో తనకు 1,700 ఎకరాల భూమిని కేటాయిస్తే… అందులో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు ఏర్పాటు చేస్తామని, తత్ఫలితంగా మరింత నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి అవుతుదంని, దానిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విశాఖ ఉక్కుకు భారీ ఎత్తున లాభాలు వస్తాయని తెలిపింది. ఓ ప్రైవేట్ సంస్థ స్టీల్ ప్లాంట్ లోకి అడుగుపెడితే… ఆపై స్టీల్ ప్లాంట్ మొత్తం దశలవారీగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని కార్మిక సంఘాలు నిరసనలకు దిగాయి. వెరసి పోస్కో తన ప్రతిపాదనలను పక్కనపెట్టేసి వెనక్కి తగ్గక తప్పలేదు.
తాజాగా కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లుగా… కేంద్ర ప్రభుత్వం వద్ద డబ్బు తీసుకుని… ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులను విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏర్పాటు చేసేందుకు పోస్కో సమ్మతించింది. అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు యత్నించిన పోస్కో నుంచే ఇప్పుడు టెక్నాలజీని కొనుగోలు చేసి ఇస్తామని చెబుతున్న కేంద్రం ప్రతిపాదనపై కార్మిక సంఘాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఒక్కో ఆర్క్ ఫర్నేసుకు రూ.2.500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఖర్చు అవుతుంది.
ఇలా పోస్కో నుంచి 3 ఆర్క్ ఫర్నేసుల కోసం కేంద్రం రూ.7,500కోట్లను వెచ్చించేందుకు సిద్ధమైంది. ఇక మరో రూ.10 వేల కోట్లను ఇతరత్రా అసరమైన టెక్నాలజీని సంస్థకు అందించేందుకు వినియోగించనుందట. ఇప్పుడు పోస్కో నేరుగా విశాఖ ఉక్కు కాంపౌండ్ లోకి ఎంటర్ కావడం లేదు. కేవలం కేంద్రం నుంచి డబ్బులు తీసుకుని… తన సాంకేతికతతో విశాఖ ఉక్కు ప్రాంగణంలో 3 ఆర్క్ ఫర్నేసులను ఏర్పాటు చేసి వెళ్లిపోతుంది.
మరి ఇదే విషయాన్ని కూటమి సర్కారు విశాఖ ఉక్కు కార్మిక సంఘాలకు చెప్పి… వారిని ఒప్పించే యత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఓ సంస్థ ఆవరణలోకి మరో సంస్థ ఏకంగా పెట్టుబడులు పెడుతూ ఎంటర్ అయితే ప్రమాదం గానీ… ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని కేవలం తన టెక్నాలజీని అందించి వెళ్లిపోతుంటే… ఇబ్బందేమీ లేదు కదా అన్న మాటను కూటమి సర్కారు ప్రతినిధులు కార్మికసంఘాలకు వివరించే యత్నం చేస్తున్నారట. వెరసి త్వరలోనే విశాఖ ఉక్కుకు ఈ రివైవల్ ప్యాకేజీతో సరికొత్త జీవం వచ్చేసినట్లేనని చెప్పక తప్పదు.