వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభు వినయ్ కుమార్ గత 4 నెలల నుండి విధులకు హాజరు కాకుండా, హాజరు రిజిస్టర్, ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని, సర్వీస్ రిజిస్టరులో పుట్టినతేదీ మార్చుకుని, చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకోవటంతో పాటు సీనియారిటీ లిస్టులో అక్రమాలకు పాల్పడ్డారని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ వనపర్తి జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ కి ఫిర్యాదు చేశారు.
ప్రభు వినయ్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు అతనిని సస్పెండ్ చేశారని రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. ఫిర్యాదుపై స్పందించి ప్రభు వినయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వానికి రాచాల కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో మరో జిల్లా అధికారి నిర్లక్ష్యంపై పిర్యాదు చేస్తామని రాచాల చెప్పారు. ప్రభుత్వం నుండి వేతనం, ఇంటి అద్దె, ఇతర ఖర్చులు(డి ఎ), వాహనం పొందుతున్న అధికారులు ప్రజలకు ఇబ్బందులు పెట్టడం, పిర్యాదులపై స్పందన లేకపోవడం, న్యాయ వ్యవస్థలకు తప్పుడు నివేదికలు ఇవ్వడం పై పిర్యాదు చేస్తామని చెప్పారు. ఆత్మ విమర్శ చేసుకోవాలని ఇబ్బందులు పెట్టే అధికారులను కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్