16.9 C
Hyderabad
January 21, 2025 09: 48 AM
Slider ఖమ్మం

దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం

#ponguletisrinivasareddy

దశాబ్దాల నుండి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు ముంపు సమస్యకు  మరో ఏడు నెలల్లోగా శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ ,హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మున్నేరు నది ఒడ్డున ముంపునకు గురవుతున్న నివాస కాలనీలకు శాశ్వత పరిష్కారం   చూపుతూ నదీ తీరం వెంబడి రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల ఆర్‌సిసి రిటైనింగ్‌వాల్‌ నిర్మిస్తున్నామని తెలిపారు.

వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని   జూలై 15 వ తేదీలోగా పనులను పూర్తి చేసి తీరాలని అధికారులను ఆదేశించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 234 ఎకరాల భూమి అవసరం ఉండగా 64 ఎకరాలు  ప్రభుత్వ భూములు ఉండగా, 170 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయని  వెంటనే ఈ భూములను సేకరించడానికి యజమానులతో మాట్లాడి యుద్ధ ప్రతిపాదికన భూసేకరణ జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో మున్నేరు వాగు పొంగి పొర్లడం వల్ల ఖమ్మం, పాలేరు నియోజకవర్గం ప్రజలు తరచూ వరద సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటువంటి పరిస్థితిని నియంత్రించడానికి రిటైనింగ్ వాల్ నిర్మాణం ఒకటే పరిష్కారం అని అన్నారు.

రిటైనింగ్ వాల్ డిజైన్ చేసే సమయంలో చెక్ డ్యాం ప్రవాహం పరిగణలోకి తీసుకున్నారా, నగరంలోని క్యాచ్ మెంట్ ఏరియా నుంచి వచ్చే వరద అంచనా ఎంత వంటి వివరాలను ఈ సందర్భంగా అధికారుల నుండి  ఆరా తీశారు. ప్రతి నెల రెండు రోజులు ఈ పనులను తనిఖీ చేయడం జరుగుతుందని,  ప్రతి రోజూ ఎంత మేరకు పని జరగాలో ప్రణాళిక తయారు చేసుకోవాలని, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఫీల్డ్ లెవల్లో ఏర్పాటు చేయాలని, ప్రతి రోజు పనుల పురోగతి వివరాలు తనకు అప్డేట్ చేయాలన్నారు. 

మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, సర్వే రెండు రోజులలో పూర్తి చేసి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఎన్ఎస్పి సంబంధించిన భూములు,  ఖమ్మం అర్బన్ లోని భూములు ఎంత సేకరించాలి, దానికి నిర్దేశించుకున్న ప్రణాళిక ఇటువంటి పూర్తి వివరాలు నివేదికలు ఉండాలని మంత్రి పేర్కొన్నారు. మున్నేరు నది బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాల వివరాలు, ఖమ్మం అర్బన్ పరిధిలో ప్రభుత్వ భూములలో జరిగిన ఆక్రమణలకు సంబంధించి వారం రోజులలో పూర్తి నివేదిక అందించాలని రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు. 

భూ సేకరణ కోసం సంబంధిత రైతులతో సంప్రదింపులు జరిపేందుకు నిపుణుల కమిటీ నియమించుకోవాలని అన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చేలా చూడాలని అన్నారు. సర్వేలో ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములుగా చూపిస్తూ సిబ్బంది ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడ ఎటువంటి అవకతవకలకు పాల్పడడానికి వీలులేదని మంత్రి స్పష్టం చేశారు.

Related posts

సాధారణ రైతు బిడ్డకు ఎంబీబీఎస్ లో సీటు

mamatha

ఐ ఎఫ్ టి యూ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

Satyam NEWS

జైలుకెళ్లే జగన్ ను నమ్ముకుంటే అధికారులకు అధోగతే

Satyam NEWS

Leave a Comment