మూడు రాజధానులు చేసిన వారు ముగ్గురు సిఎం లను ఎన్నుకోవాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు. రాజధానులు మూడు ఉంటే సిఎం ఎక్కడ ఉంటాడనే ప్రశ్న వస్తుంది కాబట్టి ముగ్గురు ముఖ్యమంత్రులను ఎన్నుకుంటారా అని వారు ప్రశ్నించారు. జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు నేడు రాజధాని గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.
వెలగపూడి గ్రామంలోని రైతుల నిరాహార దీక్ష శిబిరానికి చేరుకున్న జనసేన నాయకులు వారికి సంఘీభావం ప్రకటించారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదని, తాము భూములు ఇచ్చిన రైతులమని వారు తెలిపారు. చంద్రబాబునాయుడిపై కోపం ఉంటే వారు వారు తేల్చుకోవాలని తమకు అన్యాయం చేయడం తగదని వారు వెల్లడించారు. రాజధాని ఉంటుందో ఉండదో అనే అనుమానంతో తాము తిండి తిప్పలు కూడా లేకుండా రోడ్లపైకి వచ్చామని వారు తెలిపారు.
తమ భూములు వాపసు ఇస్తామంటున్నారని, ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. తాము సాగు చేసుకునే భూములు ఇచ్చామని ఇప్పుడు అక్కడ భవనాలు నిర్మించారని తమకు భూములు ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. ఈ సమస్య తీరే వరకూ జన సేన అక్కడి రైతుల తరపున పోరాడుతుందని నాగబాబు స్పష్టం చేశారు.